తక్షణమే ప్రధాని జోక్యానికి జగన్ వినతి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న జలవివాదంపై తక్షణమే ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో కూడా జగన్ ఈ అంశంపై ప్రధానికి ఓ లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖకు, కెఆర్ ఎంబీకి పదే పదే ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కావటంలేదని..అందుకే ప్రధాని జోక్యాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. '' తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తోంది. కేఆర్‌ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా... జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి. శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోంది.కెఆర్‌ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.
దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుంది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా.. సీఐఎస్‌ఎఫ్ బలగాల పరిధిలోకి ప్రాజెక్ట్‌లను తేవాలి. తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా... కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి'' అని కోరారు. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ అక్రమంగా నీటిని తోడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటున్నాయని తన లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి రావాల్సిన వాటాను నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణ నిరంతరాయం జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఏపీ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోందని తెలిపారు.