Telugu Gateway
Andhra Pradesh

ట్రెండ్ ఫాలో అయిన జగన్

ట్రెండ్ ఫాలో అయిన జగన్
X

ట్రెండ్ ను క్యాష్ చేసుకోవటం లో రాజకీయ నాయకులు ముందు వరసలో ఉంటారు. ఈ విషయం లో వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా తక్కువేమి కాదు. సీఎం జగన్ తన పదవి కాలంలో ఇప్పటికే ఢిల్లీ లో పదుల సార్లు ప్రధాని మోడీ తో సమావేశం అయ్యారు. అయిన ప్రతిసారి శాలువా కప్పి ఆయనకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించే వారు. దీని వెనక బలమైన కారణం కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం దేశంలోనే పేరు మోసిన దేవాలయాల్లో ఒకటి అనే విషయం తెలిసిందే. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రామ జపమే. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరంలో ఈ నెల ఇరవై రెండున విగ్రహ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి.

ఇది అంతా ఒకెత్తు అయితే మంగళవారం నాడు ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ లోని సత్య సాయి జిల్లాలో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ అఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) ను ప్రారంభించారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో సీఎం జగన్ ఎప్పటిలాగానే ప్రధాని మోడీ కి మెమెంటో అందచేశారు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఆయన వెంకటేశ్వర స్వామి విగ్రహం కాకుండా రాముడి విగ్రహాన్ని ప్రధాని మోడీ కి అందచేశారు. ఇదేమి తప్పు కాదు...రాముడి విగ్రహం ఇవ్వకూడదు అని కూడా ఎవరూ చెప్పరు. కానీ చర్చ అంతా మోడీని కలిసిన అన్ని సార్లు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బహుమతిగా ఇచ్చిన జగన్ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఉన్న విగ్రహం ఇవ్వటం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాత్రం ఎప్పటిలాగానే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాని మోడీకి బహుకరించటం విశేషం.

Next Story
Share it