జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం
ఏపీ సీఎం జగన్ పారిస్ పర్యటనకు సీబీఐ అభ్యంతరం చెబుతోంది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత పనుల మీద పారిస్ వెళ్ళటానికి తాజాగా కోర్టు అనుమతి కోరారు. పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్ దేశం విడిచివెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి పొందాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆయన తన కుమార్తె కాలేజీ స్నాతకోత్సవానికి వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ వినతిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో సీఎం జగన్‌కు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. వివిధ కారణాలు చెప్పి జగన్ విదేశాలకు వెళ్తున్నారని సీబీఐ పేర్కొంది.
జగన్ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని పేర్కొంది. వాస్తవానికి ఇప్పుడు కూడా కేసుల విచారణ ఏమి అంత వేగంగా సాగుతున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలో సీబీఐ వాదన ఆసక్తికరంగా మారింది. మరి సీబీఐతో కోర్టు ఏకీభవిస్తుందో లేదో వేచిచూడాల్సిందే. జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. జులై2న జరిగే కాన్వకేషన్ లో ఆమె సర్టిఫికెట్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు జగన్ కోర్టు అనుమతి కోరారు. జూన్ 28 నుంచి వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు.