Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికల వేళ ప్రస్తావనతో వైసీపీ నేతలూ షాక్

ఎన్నికల వేళ ప్రస్తావనతో వైసీపీ నేతలూ షాక్
X

ఎన్నికలు వచ్చాయి. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మళ్ళీ బాబాయ్ గుర్తొచ్చాడు. అధికారంలో ఉన్న గత ఐదు సంవత్సరాలుగా ఆయన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఎప్పుడూ సీరియస్ గా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతిపక్షంలో ఉండగా వివేకానందరెడ్డి హత్యపై సిబిఐ విచారణ కోరిన జగన్ ..తర్వాత మాట మార్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో జగన్ ఈ హత్య ను రాజకీయంగా వాడుకున్నారు. వివేకా హత్య వెనక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు అంటూ అప్పటిలో ఆరోపణలు గుప్పించారు. తన సొంత పత్రికలో కూడా ఈ మేరకు ప్రచారం చేసిన విషయం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరూ చూశారు. కానీ ఈ కేసు లో సిబిఐ విచారణ స్టార్ట్ అయిన తర్వాత వేళ్ళు అన్ని వై ఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి వైపు చూపించిన విషయం తెలిసిందే. పోనీ జగన్ చెపుతున్నట్లు వివేకా హత్య కేసు లో అసలు దోషులు ఎవరో తేల్చేందుకు సీఎం గా ఉన్న జగన్ ఈ ఐదేళ్లలో చేసింది ఏమిటి అనే ప్రశ్న ఉదయించక మానదు. ఒక్క వివేకా హత్య కేసు విషయంలోనే కాదు...ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసు లో కూడా జగన్ ఇదే వైఖరి అనుసరించారు. ఇలాంటి దాడి జరిగిన తర్వాత సీఎం అయిన జగన్ అసలు ఇందులో సూత్రధారులు ఎవరు..పాత్రధారులు ఎవరు అనే అంశంపై ఫోకస్ పెట్టిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించవు.

ఈ కేసు ను ఎన్ ఐఏ విచారణ చేసినా కూడా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తులు అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్ అది చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. అప్పటికే అసలు ఈ దాడి పై కూడా రాజకీయ వర్గాల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చివరకు ఈ కేసు ను విచారించిన ఎన్ఐ ఏ కూడా ఇందులో కుట్ర కోణం ఏమి లేదు అని తేల్చింది. గత ఎన్నికల ముందు జగన్ కు వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు లు పెద్ద అస్త్రాలుగా ఉపయోగపడ్డాయనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల క్రితమే వివేకా కుమార్తె సునీత ఢిల్లీ లో మీడియా సమావేశం పెట్టి మరీ వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయవద్దు అని కోరారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారిని ప్రజా కోర్టు లోనే శిక్షించాలని కోరారు. దీంతోనే జగన్ ఐదేళ్లు ఈ కేసు పై మౌనంగా ఉండి...ఈ ఎన్నికల్లో ఇది తనను ఇబ్బందికి గురి చేయవచ్చు అన్న లెక్కలతోనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర తొలి రోజు బహిరంగ సభలోనే వివేకా హత్య విషయాన్ని ప్రస్తావిస్తూ బాబాయ్ ని చంపింది ఎవరో దేవుడికి, ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు అనే చర్చ సాగుతోంది. జగన్ వ్యాఖ్యలు కొంత మంది వైసీపీ నేతలను కూడా విస్మయానికి గురిచేశాయనే చెప్పాలి. జగన్ వ్యాఖ్యలపై రాబోయే రోజుల్లో సునీత, షర్మిలలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story
Share it