విన్నపాలు వినవలె...మోడీతో సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఈ భేటీ గంట పాటు సాగింది. గతంలో పలు మార్లు ప్రధాని మోడీకి వివరించిన అంశాలనే మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ఏపీకి సంబంధించి అత్యంత కీలకమైన అంశాల్లో ఒక్కటంటే ఒక్క దానికి కూడా కేంద్రం ఇంత వరకూ ఆమోదం తెలపలేదు. సీఎం జగన్ పలుమార్లు ప్రదాని నరేంద్రమోడీతోపాటు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేసినా కూడా కేంద్ర సర్కారు మాత్రం అసలు వీటిపై స్పందించటంలేదనే చెప్పొచ్చు. అయితే సోమవారం నాటి భేటీలో మరోసారి సీఎం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేవనెత్తారు. రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణలో ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలనూ కోల్పోయామన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన ఇతర హామీలు అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుందని తెలిపారు.
2013 భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు గణనీయంగా పెరిగిందని, ఏప్రిల్ 1, 2014 అంచనాల మేరకే పోలవరం నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్ట్ వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదని ప్రధానికి సీఎం వివరించారు. ''ప్రాజెక్ట్ అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 90లో పేర్కొన్న స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. ప్రాజెక్ట్ ఆలస్యమైతే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని నిర్ణయించాలని కోరారు. పోలవరం అంచనా వ్యయాన్ని 55,657 కోట్ల రూపాయలుగా నిర్ణయించాలి. పోలవరం నిర్మాణంపై రూ.2,100 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రధానితో భేటీలో సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.