తిరుపతి ప్రజలకు జగన్ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనూహ్యంగా ఈ ఎన్నిక ప్రచారంలో కూడా పాల్గొనటానికి రెడీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ క్యాంప్ ఆఫీస్ దాటి బయటకు రాకుండానే ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు వచ్చేలా ప్లాన్ చేసి విజయం సాధించారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ మెజారిటీ గతం కంటే ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే జాగ్రత్తలో వైసీపీ ఉన్నట్లు కన్పిస్తోంది.
అందుకే రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు, సంక్షేమ ఫలాలు అందుకున్న వారికి లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయా కుటుంబాలకు వివిధ పథకాలు, కార్యక్రమాలు ద్వారా జరిగిన లబ్ధిపై లేఖలో వివరణ. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై సంతకం చేశారు. ఈ లేఖలను నియోజకవర్గ ప్రజలకు పంపనున్నారు.