గ్రీన్ ఎనర్జీలో ఏపీది న్యూట్రెండ్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారి దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇందులో ఆయన పలు పారిశ్రామిక సంస్థలతో ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే అదానీ గ్రూపుతో భారీ ఒప్పందం ఖరారు అయిన విషయం తెలిసిందే. సీఎం జగన్ డీకార్బనైజ్డ్ మెకానిజంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కర్నూలులో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యువబుల్ ప్రాజెక్ట్ గురించిన వివరాలను వె.ల్లడించారు. ఏపీలో ఏర్పాటు చేసిన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు ద్వారా విండ్, హైడల్, సోలార్ విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ఎటువంటి కాలుష్యం లేకుండా సుస్థిరమైన విద్యుత్‌ను సాధించవచ్చన్నారు.
కర్నూలు ప్రాజెక్ట్ షోకేస్‌గా నిలుస్తుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు పనులు ఇటీవలే కర్నూలులో మొదలయ్యాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ట్రెండ్‌ను నెలకొల్పిందన్నారు. కర్నూలులో నిర్మిస్తోన్న విండ్, హైడల్, సోలార్ పవర్ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఏపీలో ఉందన్నారు. ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఏపీ తరఫున పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.