మొన్న అంబానీ విమానం..ఇవాళ అదానీ విమానం
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోని అగ్ర పారిశ్రామికవేత్తల విమానాలే వాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వ్యక్తిగత పర్యటన కోసం కుటుంబ సమేతంగా సిమ్లా వెళ్లిన జగన్ అమరావతికి అంబానీలకు చెందిన విమానంలో వచ్చారు. ఆ విమానంపై ఉన్న పేర్లను బట్టి చూస్తే అప్పట్లో అది అంబానీల విమానంగా తేలింది. సీఎం అయిన దగ్గర నుంచి జగన్ కూడా చంద్రబాబు తరహాలోనే ప్రత్యేక విమానాల మీద నుంచి ఏ మాత్రం దిగటం లేదు. ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానమే తప్ప..అసలు రెగ్యులర్ సర్వీసులు వాడటం అన్నది మానేశారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఉండేది కాదు. అయితే సోమవారం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఈ సారి మరో పారిశ్రామిక దిగ్గజం అదానీ విమానంలో వెళ్లారు.
అంటే మొన్న అంబానీ విమానం..ఇప్పుడు అదానీ విమానం అన్నమాట. అదానీకి ఏపీ సర్కారు పలు ప్రాజెక్టుల విషయాల్లో అనుకూల నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను అదానీలకే అప్పగించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా కూడా చాలా విషయాలు జరుగుతున్నట్లు ప్రచారం. కేంద్రంలోని మోడీ సర్కారుకు అత్యంత సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు చెందిన ఇద్దరి విమానాలను ఏపీ సీఎం జగన్ ఉపయోగిస్తుండటం రాజకీయంగా కూడా ఆసక్తిరేపుతోంది. ఇప్పటికే అంబానీలు చెప్పిన వ్యక్తికి జగన్ ఓ రాజ్యసభ సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటికి అద్దె చెల్లించి తీసుకుంటున్నారా? లేక సీఎం కోసం కార్పొరేట్లు ఇవి ఉచితంగా సమాకూర్చాయా అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.