Telugu Gateway
Andhra Pradesh

కీలక విషయాల్లో జగన్ రివర్స్ గేర్

కీలక విషయాల్లో జగన్ రివర్స్ గేర్
X

షెడ్యూల్ ప్రకారం అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ ప్రశ్న రావటం సహజమే. ఒక్క ఛాన్స్ అంటూ ఊహించని స్థాయి విజయాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ కీలక విషయాల్లో మాత్రం హ్యాండ్సప్ అన్నారు అని చెప్పక తప్పదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయినా ఆంధ్ర ప్రదేశ్ కు అత్యంత కీలకం అయినా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయటం సంగతి పక్కన పెట్టి...ఈ నాలుగేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కారు నుంచి సవరించిన అంచనాలకు కూడా సీఎం జగన్ఆ మోదం తెచ్చుకోలేకపోయారు . వాస్తవానికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను 55548 కోట్ల రూపాయలుగా సవరించారు. ప్రతిపక్షంలో ఉండగా ఇది పెద్ద స్కాం అని ఆరోపించిన జగన్ సీఎం అయినా తర్వాత ఇవే అంచనాలను ఆమోదించాలని నాలుగేళ్లుగా కోరుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు వాటికి మోక్షం దక్కలేదు. కేంద్రంలోని మోడీ సర్కారుకు సీఎం జగన్ అవసరం అయిన ప్రతిసారి మద్దదు ఇస్తున్నారు. అయినా దీనికి ప్రతిఫలంగా మాత్రం రాష్ట్రానికి ఎక్కడ పెద్దగా ప్రయోజనాలు దక్కిన దాఖలాలు మాత్రం లేవు. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటానికి ఉపయోగపడిన అంశాల్లో ప్రత్యేక హోదా ఒకటి. హోదా వస్తే చాలు...రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని..వైసీపీ కి మెజారిటీ ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని ప్రకటించారు. జగన్ కోరుకున్నట్లు ఏకంగా ఉన్న 25 ఎంపీ సీట్లలో 22 ఎంపీలు వైసీపీ కి దక్కినా ఫలితం మాత్రం జీరో. అదేమంటే సీఎం జగన్ మాత్రం తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి లేఖ ఇస్తానని చెపుతున్నారు. అంతకు మించి ఇప్పుడు చేయటానికి ఏమి కూడా ఉండేది అని సెలవిచ్చారు. మరో కీలక అంశం రాజధాని. అసెంబ్లీ వేదికగా అమరావతికి మద్దదు ఇచ్చి..తాను అక్కడ ఇల్లు కట్టుకున్నాను అని అందరిని నమ్మించి చివరకు అమరావతి కి జగన్ హ్యాండ్ ఇచ్చారు.

మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చి అసలు రాష్ట్ర రాజధాని అంశాన్ని పూర్తిగా గందరగోళంలోకి నెట్టారు. కేంద్రంలోని బీజేపీ తో ఎంతో ఫ్రెండ్లీ గా ఉంటూ కూడా విభజన హామీలు సాదించుకోవటంలో కూడా జగన్ దారుణంగా విఫలం అయ్యారు. చివరకు సొంత జిల్లాకు చెందిన కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే పరిస్థితి. రామాయపట్నం పోర్టు వాస్తవానికి కేంద్ర నిధులతో చేయాల్సి ఉండగా జగన్ మాత్రం అందుకు బిన్నంగా పనులు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. మధ్య నిషేధం కూడా తూచ్ అన్నారు. ఈ నాలుగేళ్లలోనే ఒక సారి మండలి ఎందుకు డబ్బులు దండగ ..అసెంబ్లీలోనే మేధావులు అందరూ ఉండగా అన్నారు అసెంబ్లీ సాక్షిగా. .వైసీపీ కి మండలిలో పూర్తి బలం వచ్చాక రివర్స్ గేర్ వేశారు. ఇలా చెప్పుకుంటే పోతే ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ చేసిన వింతలు ఎన్నో. అయితే నవరత్నాల హామీలు అమలు చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఇవే తనను గెలిపిస్తాయనే లెక్కల్లో సీఎం జగన్ ఉన్నారు. చూడాలి మరి జగన్ లెక్కలు ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో. అయితే వైసీపీ కి చెందిన కొంత మంది నేతలు మాత్రం చిన్న వయసులో వచ్చిన అవకాశాన్ని సీఎం జగన్ దుర్వినియోగం చేసుకుంటున్నారు అని అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it