Telugu Gateway
Andhra Pradesh

ఏపీలోనూ తెలంగాణ ఫలితాల టెన్షన్ !

ఏపీలోనూ తెలంగాణ ఫలితాల టెన్షన్ !
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా?. ఈ రెండు రాష్ట్రాలకు పాలన విషయంలో ఏమైనా సారూప్యత ఉందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొత్తం బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మోడల్ నే ఫాలో అయ్యారు. జగన్ సీఎం అయిన తొలినాళ్లలో ముప్పై సంవత్సరాలు తానే అధికారంలో ఉండేలా పాలిస్తానని ప్రమాణస్వీకారం రోజే ప్రకటించారు. ఆశ ఉండటం...ఆ దిశగా ప్రయత్నం చేయటం తప్పేమి కాదు. కానీ జగన్ ప్రకటన అయితే చేశారు కానీ...ఆచరణ దగ్గరకు వచ్చే సరికి మాత్రం అందుకు భిన్నమైన మోడల్ ను ఫాలో అయ్యారు. కెసిఆర్ తరహాలో అసలు గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ సచివాలయం వైపు కన్నెత్తి చూడటం లేదు. మంత్రి వర్గ సమావేశం ఉంటేనే జగన్ సచివాలయానికి వచ్చేది. ఇక రెగ్యులర్ పాలన..సమీక్షలు అన్నీ కూడా తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచే. ఇది ఒకటి అయితే కెసిఆర్ తరహాలోనే జగన్ కూడా ఎమ్మెల్యేలను ఎప్పుడో తప్ప కలిసే ఛాన్స్ లేకుండా చేశారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లోకి ఎమ్మెల్యే లు అయినా..ఐఏఎస్ లు అయినా అనుమతి ఉంటే తప్ప లోపలికి అనుమతించరు అని ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. అంటే తెలంగాణలో ప్రగతి భవన్ స్టైల్ లో అన్న మాట. మరో కీలక విషయం ఏమిటి అంటే కెసిఆర్ తరహాలోనే జగన్ కూడా ప్రజలకు దూరంగా పరిపాలన సాగిస్తున్నారు. సీఎం అయిన తర్వాత జగన్ ఎప్పుడూ ప్రజలను నేరుగా కలుసుకున్నది లేదు.

ఎంతో అనుభవం ఉన్న జగన్ తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ప్రజాదర్భార్ పెట్టి ప్రజలను నిత్యం కలిసే వాళ్ళు. కానీ జగన్ మాత్రం తన తండ్రి మోడల్ కాకుండా కెసిఆర్ మోడల్ ను ఎంచుకున్నారు. అటు ఎమ్మెల్యేలను..ఇటు ప్రజలను కలవకుండా ఒక సీఎం పరిపాలన సాగించటం అంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు అనే చెప్పొచ్చు. ఇవి అన్నీ సీఎం వ్యవహారశైలికి సంబదించిన విషయాలు అయితే ఇక ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు ఏవీ అంత ఆశాజనకంగా లేవనే చెప్పొచ్చు. ఉద్యోగుల విషయంలో కూడా జగన్ సర్కారు పలు అంశాల్లో వాళ్ళను ఇబ్బందులకు గురిచేస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసు లు మెరిట్ ఆధారంగా పెట్టారు అనటం కంటే రాజకీయ టార్గెట్ గా పెట్టినట్లు ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే అర్ధం అవుతుంది. మరో వైపు రాజధాని అంశంలో గందరగోళం..పోలవరం అటకెక్కటం, రాష్ట్రంలో రహదారులు దారుణంగా ఉండటం..కొంత మంది ఎమ్మెల్యే ల తీరు తీవ్ర విమర్శలకు కారణం అవుతున్న వేళ అధికార వైసీపీ పై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇవన్నీ కలిపి చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంత ఈజీ గా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై ఎంతో కొంత ఉండటం ఖాయం అనే అభిప్రాయం పలు వర్గాల్లో ఉంది.

Next Story
Share it