Telugu Gateway
Andhra Pradesh

ఐదేళ్ల జగన్ పాలనలో జరిగింది ఇదే

ఐదేళ్ల జగన్ పాలనలో జరిగింది ఇదే
X

సహజంగా ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వం అని చెపుతూ ఉంటారు. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నది వైసీపీ ప్రభుత్వం. కానీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం గత ఐదేళ్లుగా సెల్ఫ్ ఫోకస్డ్ గా పాలన సాగిస్తున్నారు. అంటే తాను సీఎం సీటు లో కూర్చోవటానికి కారణమైన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏ మాత్రం క్రెడిట్ రాకుండా సర్వం తానే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రధాన ఉదాహరణ ఈ మాటలే అని చెప్పొచ్చు. ‘మీ బిడ్డ ఈ రోజు బటన్ నొక్కితే 2 .70 లక్షల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు...వివక్ష లేకుండా నేరుగా వెళ్లాయి.’. గత కొంత కాలంగా.. ఇప్పుడు ఎన్నికల సభల్లోనూ జగన్ నిత్యం చెప్పే మాట ఇదే. ఆయన ఎక్కడా పెద్దగా వైసీపీ ప్రభుత్వం అని కానీ... ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అని కానీ చెప్పరు. మీ బిడ్డ జగన్ ఇచ్చారు అనే చెప్పుకుంటూ వెళుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో తప్ప కలిసింది లేదు. తాను కలవకుండా ఉండటమే కాకుండా...ప్రజలతో కూడా ఎమ్మెల్యేలకు పెద్దగా సంబంధం లేకుండా చేశారు అనే చర్చ వైసీపీ నేతల్లోనే ఉంది. ఎందుకు అంటే దీనికి ప్రధాన కారణం వాలంటీర్ల వ్యవస్థ.

ఏ నియోజకవరంలో అయినా..ఎవరికైనా రేషన్ కార్డు కావాలన్నా...పెన్షన్ కావాలన్నా వాలంటీర్ ద్వారానే పనులు జరిగిపోయాయి. కొన్ని పనులు గ్రామ సచివాలయం తో నడిచిపోయాయి . దీంతో నియోజకవర్గంలోని ప్రజలు పెద్దగా ఏ పని మీద కూడా ఎమ్మెల్యేను కలవాల్సిన పరిస్థితి లేకుండా చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి పెట్టని రీతిలో జగన్ ఎమ్మెల్యేలను దూరం పెట్టారు అని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. జగన్ గత ఐదేళ్ల పాలనలో అటు ఎమ్మెల్యేలతోనే కాకుండా..ప్రజలతో కూడా డిస్ కనెక్ట్ అయిపోయారు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఏ పార్టీ కి అయినా...ఎమ్మెల్యే ఎంతో కీలకం అని...కానీ జగన్ మాత్రం ఒక్క ముఖ్యమంత్రి తలుచుకుంటే తప్ప...నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేతో ఏమి పనులు కావు అనే పరిస్థితికి రాజకీయాన్ని తీసుకువచ్చారు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

జగన్ మరో సారి అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అటు జగన్ పట్టించుకోక..ఇటు నియోజకవర్గంలో పనులు చేసేది ఏమి లేక కొంత మంది ఇష్టానుసారం వ్యవహరించి పార్టీని కూడా ఇరకాటంలోకి పెట్టారు అని ఒక నేత వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ ఒక్క అధికారం పార్టీ ఎమ్మెల్యేను మందలించిన దాఖలాలు లేవు. సమన్వయ కర్తలు కొంత మందిపై ఫిర్యాదు చేసినా...వాళ్లకు నెక్స్ట్ టికెట్ ఇవ్వను అని చెప్పరు కానీ..వాళ్ళను పద్ధతి మార్చుకోమని చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేదు అని మరో నేత వెల్లడించారు. కేంద్రంలో మోడీ సర్కారు కు బొటాబోటి మెజారిటీ వస్తేనే తమ మాట వింటారు అని జగన్ చెపుతారు అని..ఇక్కడ కూడా ఆ పరిస్థితి వస్తే తప్ప జగన్ ఎమ్మెల్యేలను పట్టించుకోరు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.

Next Story
Share it