Telugu Gateway
Andhra Pradesh

ఇంకా కెసిఆర్ అంటే భయమా...లేక వేరే కారణాలు ఉన్నాయా?!

ఇంకా కెసిఆర్ అంటే భయమా...లేక వేరే కారణాలు ఉన్నాయా?!
X

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ల మధ్య పరిష్కారం కావాల్సిన విభజన సమస్యలు ఎన్నో ఉన్నాయి. కరోనా తగ్గిన తర్వాత కూడా ఈ అంశంపై అప్పటి తెలంగాణ సీఎం కెసిఆర్ తో భేటీ అయి..వీటిపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ పెద్దగా ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జగన్, కెసిఆర్ లు ఎంతో సాన్నిహిత్యంగా ఉన్నారు. రాష్ట్ర విషయాలను పక్కన పెడితే వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరూ ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇది అంతా గతం. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయి..ఫలితాలు వచ్చి...రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా రేవంత్ రెడ్డి ని కాబోయే సీఎం గా ప్రకటించింది. అయినా సరే ఇప్పటివరకు పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలంగాణకు కాబోయే కొత్త సీఎం రేవంత్ రెడ్డి కి మర్యాదపూర్వక అభినందనలు కూడా తెలపలేదు. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి. జగన్ కు కాంగ్రెస్ అంటే నచ్చకపోవచ్చు. అది అయన ఇష్టం. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు...నిన్న మొన్నటివరకు కలిసి ఉన్న ప్రాంతాలు...దీంతో సంబంధం లేకుండా కూడా పొరుగునే ఉన్న రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వం వస్తుంటే దానికి నాయకత్వం వహించేది ఎవరో తెలిసిన తర్వాత అభినందలు తెలపటం మర్యాద అని..కానీ వైసీపీ, సీఎం జగన్ దీన్ని కూడా పాటించకపోవడం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి తెలంగాణాలో తిరిగి బిఆర్ ఎస్ పార్టీ నే అధికారంలోకి రావాలని వైసీపీ కోరుకుంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి అధికారికంగానే మళ్ళీ తెలంగాణాలో కేసీఆర్ సీఎం కావాలని ప్రకటించారు కూడా. బిఆర్ఎస్ తరపున వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం తెలంగాణాలో పనిచేసినట్లు వార్తలు వచ్చాయి. వైసీపీ కోరికకు బిన్నంగా తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారు. అయినా కూడా ఈ వార్త పబ్లిష్ చేసే సమయానికి అటు సీఎం జగన్ నుంచి, పార్టీ తరపున అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం సహచర ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నందుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదగటం కీలకపరిణామం అంటూ పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఓడిపోయినా రేవంత్ రెడ్డి కి అభినందనలు చెప్పటానికి సీఎం జగన్ భయపడుతున్నారా అంటూ చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉంటే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి కి బహిరంగంగా అభినందనలు తెలుపలేదు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకటే అని ప్రచారం ఉన్న తరుణంలో అయన ఈ నిర్ణయం తీసుకున్నారా ..లేక వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారా అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ మాత్రం రేవంత్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి విషయంలో అటు జగన్, ఇటు చంద్రబాబు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it