రేవంత్ కు పెట్టుబడులు...చంద్రబాబు, లోకేష్ కు దక్కింది దావోస్ ఫోటోలు
ఈ డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్ తో కోరుకున్న సమాచారం అంతా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ఎప్పటి నుంచో ప్రచారం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఒక అడుగు ముందుకు వేసి స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఏ రాష్ట్ర పారిశ్రామిక విధానం అయినా నెట్ లో కొడితే కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. పైగా ల్యాండ్ బ్యాంకు వివరాలు సైతం కొన్ని రాష్ట్రాలు తమ తమ వెబ్ సైట్స్ లో ఉంచుతున్నాయి. ఈ తరుణంలో ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీలాగా బ్రోచర్లు వేసుకుని దావోస్ మీటింగ్ కు వెళ్లి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అడగ్గానే ఎవరైనా పెడతారా?. పైగా అక్కడికి వచ్చేది అంతా వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే దిగ్గజ సంస్థల ప్రతినిధులు. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ...ఏ ప్రజానిధితో ఎలా వ్యవహరిస్తే పని అవుతుందో కార్పొరేట్ వర్గాల్లో ముందే సమాచారం ఉంటుంది. బ్రోచర్లు చూసి...ఎవరో అడిగారు అని ఏ కంపెనీ కూడా పెట్టుబడి పెట్టదు.
ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడి పెడితే తమకు కలిగే లాభం ఏంటి అన్నదే పారిశ్రామికవేత్తల మొదటి లెక్కగా ఉంటుంది. కానీ ఆ విషయం పక్కన పెట్టి తాము వేల మందికి ఉద్యోగం ఇస్తున్నాం అని చెప్పుకుంటారు.ప్రభుత్వాలు కూడా ఎన్నో ప్రయోజనాలు ఆశించి ఇదే విషయాన్ని ముందు పెడతాయి. తమ పేర్లే పెద్ద బ్రాండ్ లు అంటూ ప్రచారం చేసుకుంటూ దావోస్ సదస్సుకు వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ లకు ఈ సారి మాత్రం బిగ్ షాక్ తగిలింది అనే చెప్పాలి. ఎందుకంటే శుక్రవారంతో దావోస్ సదస్సు ముగియనుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేదు.
ఏపీ ఒప్పందాలు ఏమి చేసుకోకపోవడం తో ఈ ప్రభావం తమపై పడకుండా చూసుకునేందుకు ఇప్పటికే ఒక ప్రచారాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారు. దావోస్ అనేది ఒప్పందాలు చేసుకునే వేదిక కాదు...ఇది ఒక కనెక్టింగ్ సెంటర్ అంటూ కొత్త రాగాలు తీస్తున్నారు. కానీ చంద్రబాబు గతంలో ఇదే దావోస్ వేదికగా ఎన్నో ఒప్పందాలు చేసుకోవటం..ప్రచారం చేసుకోవటం తెలియంది కాదు. చంద్రబాబుతో పోలిస్తే పరిపాలనా పరంగా ఎంతో తక్కువ అనుభవం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టీం తో కలిసి ఇదే దావోస్ లో ఇప్పటి వరకు ఏకంగా 70 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నారు.
ఇందులో మేఘా వంటి లోకల్ కంపెనీల ఎంఓయూలు పక్కన పెట్టినా కూడా ఈ నంబర్ బాగానే ఉన్నట్లు లెక్క. కుదిరిన ప్రతి ఎంఓయూ అమలు జరుగుతుంది అని కాదు కానీ ..అది ఒక ఇండికేషన్..రాష్ట్రంపై ఇంటరెస్ట్ చూపటం కింద లెక్క. అలాంటి ఇంటరెస్ట్ లు కూడా ఏపీ విషయంలో ఈ సారి ఏమీ లేకపోవటం అధికారులను కూడా షాక్ కు గురిచేస్తున్న అంశం. ఈ దావోస్ సదస్సు కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన వ్యయం దగ్గర దగ్గర 75 కోట్ల రూపాయలు వరకు ఉంటుంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. సీఎంఓ టీం తో పాటు పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి, ఈడీబీ అధికారులు కూడా ఇందులో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు భారీ టీం తో వెళ్లి కూడా అక్కడ సాధించింది ఏమి లేదు అనే చెప్పాలి. అయితే దావోస్ లు కుదిరే ఒప్పందాలు అన్ని అమలు కావు అని చెప్పటానికి కూడా లేదు. వీటిలో కచ్చితంగా కొన్ని అమలు అవుతాయి కూడా. ఈ సారి చంద్రబాబు , నారా లోకేష్ లకు దావోస్ లో దక్కింది పెట్టుబడులు కాదు...పారిశ్రామిక ప్రముఖులతో ఫోటోలు మాత్రమే అంటూ కొంత మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.