Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘పవర్ మాయ’!

చంద్రబాబు ‘పవర్ మాయ’!
X

ఈ రెండు ప్రాజెక్టులు నవయుగ ప్రమోటర్లవే

గతంలోనే 2300 మెగావాట్ల హైడ్రో పంప్డ్ పవర్ ప్రాజెక్ట్స్

ప్రభుత్వ నిర్ణయాలు చూసి షాక్ అవుతున్న అధికారులు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబబు నాయుడు చూస్తుంటే రాష్ట్రం కోసం కేవలం కొన్ని కంపెనీల కోసమే పనిచేస్తున్నట్లు ఉంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అలా ఉంటున్నాయి మరి. రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు ఎంపిక చేసిన సంస్థలకే కేటాయించారు. గత కొన్ని నెలలుగా విద్యుత్ ప్రాజెక్ట్ ల కేటాయింపు కూడా అలాగే సాగుతూ పోతోంది. గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన ఎస్ఐపీబి సమావేశం జరిగింది. ఇందులో మొత్తం పదిహేడు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు . ఈ సంస్థలు 31167 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా 32663 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అధికారికంగా వెల్లడించారు. ఇందులో వైజాగ్ లో టిసిఎస్ పెట్టుబడి ప్రతిపాదన కూడా ఉంది. టిసిఎస్ 1370 కోట్ల రూపాయలతో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది .

దీని ద్వారా 12000 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దీంతో పాటు జెఎస్‌డబ్ల్యు నియో ఎనర్జీ , డిక్సన్ టెక్నాలజీస్ , తదితర సంస్థలు ఉన్నాయి. అయితే వీటిలో అందరి దృష్టిని ఆకర్షించిన కంపెనీ చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. సరిగ్గా ఈ కంపెనీ పెట్టిందే రెండు నెలల క్రితం. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ సంస్థ తిరుపతిలో 2450 కోట్ల రూపాయల పెట్టుబడితో , శ్రీ సత్యసాయి జిల్లా లో ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది అని చెప్పి ఎస్ఐ పీబి లో ఈ ప్రాజెక్ట్ లకు ఆమోదం తెలిపింది. ఇందులో డైరెక్టర్లు ఎవరు అంటే నవయుగ గ్రూప్ అధినేత చింతా విశ్వేశర రావు, గౌరీనాథ్ అట్లూరి ఉన్నారు .

విచిత్రం ఏమిటి అంటే ఇదే నవయుగా గ్రూప్ కు చెందిన కంపెనీలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గుజ్జిలి వద్ద 1500 మెగావాట్లు, చిట్టంవలస దగ్గర 800 మెగావాట్ల ప్రాజెక్ట్ లకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం కలిపి ఈ కంపెనీ కి 2300 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ దక్కాయి. మేఘా ఇంజనీరింగ్, నవయుగా ఇంజనీరింగ్ వంటి సంస్థలకు కలిపి ఏకంగా 4300 మెగావాట్ల ప్రాజెక్టులు కేటాయించారు. వీటితో పాటు మరికొన్ని కంపెనీ లు కూడా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ కూడా ఇంత వేగంగా ఎస్ఐపీబి సమావేశాలు జరిగిన ఉదంతాలు కూడా లేవు అని పరిశ్రమల శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఏపీకి కొత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం..ఈ దిశగా కృషి చేయటాన్ని ఎవరూ తప్పుపట్టారు. అసలు ఆ అవసరం కూడా ఉండదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో కాంట్రాక్టులు...ప్రాజెక్టులు ఒక ఎజెండా ప్రకారం ఎంపిక చేసిన కొన్ని సంస్థలకు మాత్రమే కేటాయిస్తూ పోతుండటంపైనే అధికార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Next Story
Share it