సుదీర్ఘ వివరణతో డిఫెన్స్ లోకి !
పదే పదే మారాను మారాను అని చెప్పుకునే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇంకా ఓల్డ్ స్కూల్ నుంచి బయటకు రావటం లేదు. ఇప్పటికి అంతా పాత రోజుల్లో లాగా తాను ఏది చెపితే అది నడిచిపోతుంది అనుకుంటున్నారు. కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సోషల్ మీడియా దగ్గర నుంచి మొదలు పెట్టి చాలా మంది వాటి వెనక ఉన్న మర్మాన్ని...ఫెయిల్యూర్స్ ను ఎండగడుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే టీడీపీ కి 135 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నా కూడా ఇది కూటమి ప్రభుత్వం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే...బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అసలు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే కీలక శాఖల మంత్రులు ఎవరూ పని చేస్తున్నట్లు లేదు అని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, హోమ్ మంత్రి వంగలపూడి అనిత లకు వచ్చిన ర్యాంక్ లు చూస్తే ప్రభుత్వ పని తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్పినట్లు అయింది. మరో వైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఫైల్స్ క్లియరెన్స్ లో పదవ ర్యాంక్ ఇచ్చి...మంత్రి నారా లోకేష్ కు ఎనిమిదవ ర్యాంక్ ఇచ్చారు. అంటే పవన్ కంటే లోకేష్ ఫైల్ బాగా క్లియర్ చేస్తున్నట్లు చెప్పినట్లు అయింది.
ఇది జనసేన నేతలు..క్యాడర్ కు ఏ మాత్రం నచ్చలేదు. నిన్న మొన్నటి వరకు ఉప ముఖ్యమంత్రి వివాదం రేపి..ఇప్పుడు మళ్ళీ ఈ ఫైల్స్ విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చి తమను అవమానిస్తున్నారు అనే అభిప్రాయం జనసేన నేతల్లో వ్యక్తం అవుతోంది. జనసేన కు చెందిన ఇద్దరు మంత్రులు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నా కూడా ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోరు అనే విషయం తెలిసిందే. ఈ ర్యాంక్ ల విషయంలో శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు సుదీర్ఘ వివరణ ఇచ్చారు అంటేనే ఇది ఎంత సెల్ఫ్ గోల్ వ్యవహారంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ట్విట్టర్ ప్రకటన
‘ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే...మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప...విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం.
దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది.‘పీపుల్ ఫస్ట్’ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాము. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి... సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను.’ అంటూ పెద్ద పోస్ట్ పెట్టారు. దీని అర్ధం ఈ ర్యాంక్ ల వ్యవహారం బెడిసికొట్టడంతో ఆయన దీని ద్వారా వివరణ ఇచ్చుకున్నట్లు ఉంది అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.