2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ దాని కోసమేనట!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని కట్టడానికే కాకుండా..రోజు వారీ ప్రభుత్వాన్ని నడపటానికి కూడా ఎడా పెడా అప్పులు చేస్తోంది. ఇవి ఎప్పటికి తీరతాయో ఎవరికీ తెలియదు. కానీ అమరావతి భూములు అమ్మి రాజధాని అప్పులు తీర్చేస్తామని సర్కారు చెపుతోంది. కాసేపు ఇంతవరకు నిజమే అనుకుందాం. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా ఫ్యూజ్ లు ఎగిరిపోవాల్సిందే. ఎన్ని విమర్శలు వస్తున్నా అమరావతి విస్తరణ కోసం మరో నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు సమీకరించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఇది అధికారికం. ఎందుకు అంటే సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్ డీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ భూమి సమీకరణ ద్వారానా ..లేక ల్యాండ్ అక్విజిషన్ ద్వారానా అన్న అంశంపై మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అన్నారు.
సీఆర్ డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మీడియాకి వెల్లడించిన మంత్రి నారాయణ మరో కీలక, సంచలన విషయం వెల్లడించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో స్పోర్ట్స్ సిటీ కోసం 120 ఎకరాలు కేటాయించామని..కానీ ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే స్థాయిలో రాజధానిలో అంతర్జాతీయ క్రీడా సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించటంతో ఇప్పుడు 2500 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరికైనా ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ..వీళ్ళు చేస్తున్నది ఏమిటి అన్న సందేహం రాకమానదు. ఒలింపిక్స్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు..ఇతర వసతులు కలిపించాలంటే తక్కువలో తక్కువ 70000 వేల కోట్ల రూపాయలు అవుతుంది అని లెక్కలు ఉన్నాయి. ఈ మొత్తం పెరిగేదే తప్ప ఏ మాత్రం తగ్గదు. పోనీ ప్రభుత్వం కేవలం స్థలం ఉచితంగా ఇస్తుంది అని ..ఇక్కడ ప్రైవేట్ వాళ్లే అన్నీ చూసుకుంటారు అని చెపుతారా అంటే ఇంత మొత్తం లో భారీ పెట్టుబడి పెట్టి రిటర్న్స్ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూడాలి.
ఇది ఏ మాత్రం వర్క్ అవుట్ అయ్యే మోడల్ కాదు అని....ఇది అంతా ప్రజలను మభ్య పెట్టడం...గాలిలో ఉంచటం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి తప్ప ఇందులో మరొకటి ఏమి లేదు అని కూడా అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పోనీ 2036 ఒలింపిక్స్ కు బిడ్ వేసే ఆలోచనలో ఉన్న కేంద్రం దీనికి అయ్యే ఖర్చులో సగానికి సగం భరించినా కూడా ఈ స్థాయి మౌలిక సదుపాయాలు అమరావతిలో కలిపించటం అంత ఈజీ గా జరిగే పని కాదు అని ఎక్కువ మంది చెపుతున్న మాట. ఎప్పటిలాగానే అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు 5000 ఎకరాలు , స్మార్ట్ ఇండస్ట్రీస్ కు 2500 ఎకరాలు కేటాయిస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. సుదీర్ఘకాలం పట్టే ప్రాజెక్ట్ లకు తమ విలువైన భూములు ఇచ్చి అంత కాలం రైతులు ఎదురుచూడగలారా...అంతా అనుకున్నట్లు సాగటానికి ఎప్పుడూ చంద్రబాబు, టీడీపీ నే అధికారంలో ఉంటుంది అని ఎవరు చెప్పగలరు. మరి ఇన్ని రిస్క్ లు అధిగమించి పూలింగ్ కు రెండవ దశలో ఎంత మంది రైతులు ముందుకు వస్తారో చూడాలి. మంత్రి నారాయణ చెపుతున్న లెక్కలు మాత్రం అంతా ఈజీ గా అయిపోతుంది అన్న తరహాలో ఉన్నాయి కానీ...క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు అన్నది స్వయంగా కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు చెపుతున్న మాట.