Telugu Gateway
Andhra Pradesh

పీ 4 ..తలసరి ఆదాయం లెక్కలతో చుక్కలు చూపిస్తున్న బాబు!

పీ 4 ..తలసరి ఆదాయం లెక్కలతో చుక్కలు చూపిస్తున్న బాబు!
X

ఏ ప్రభుత్వం అయినా భారీ లక్ష్యాలు పెట్టుకోవటం తప్పేమి కాదు. అయితే వాటిని సాధించటానికి వేసుకునే ప్రణాళికలు వాస్తవికంగా ఉండాలి. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోవటానికి మార్గం సుగమం అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది రోజు శ్రీకారం చుడుతున్న పీ 4 విధానం లెక్కలు చూసి ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ఎందుకంటే అవి ఆచరణ సాధ్యం కానీ...ఏ మాత్రం వాస్తవిక అంచనాలతో రూపొందించనవి కాకపోవటమే. ప్రభుత్వానికి ఏటా సొంతంగా వచ్చే ఆదాయంతో పాటు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా కూడా సాధ్యం కాని పేదరిక నిర్మూలన దాతల సాయంతో అయిపోతుందా?. అంటే కచ్చితంగా అది జరిగే పని కాదు అని చెప్పొచ్చు.

ఈ పీ 4 విధానం కింద కూడా సాయం అందించటానికి ముందుకు వచ్చే వాళ్లలో ఎక్కువ శాతం చంద్రబాబు ద్వారా అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనం పొందే-పొందిన పారిశ్రామిక వేత్తలే ఉంటారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. కొంత మంది నిజంగా సాయం చేయటానికి ముందుకు వచ్చినా కూడా ఎక్కువ మంది మాత్రం ప్రభుత్వం నుంచి లాభం పొందిన వారే ఉంటారు అని అధికార వర్గాల అంచనా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నో మార్గాలు..వనరులు ఉండే ప్రభుత్వం చేయలేని పేదరిక నిర్ములన ప్రైవేట్ వ్యక్తులు చేయటం, అది కూడా సాయం ద్వారా అన్నది దాదాపు అసాధ్యం అనే చెప్పొచ్చు. డబ్బు ఉన్న వారి దగ్గర నుంచి పేదల ఉన్నతికి ఒక స్కీం డిజైన్ చేయటాన్ని ఎవరూ తప్పుపట్టారు. కాని ప్రభుత్వం పీ 4 పేరుతో చెపుతున్న లెక్కలు..అంచనాలే అవాస్తవికంగా ఉన్నాయన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అసలు పీ 4 అంటే ఏంటి అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్ షిప్. అంటే దేశంలోని సంపన్నులు, పారిశ్రామిక వేత్తలు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్దిదారులకు సొంతగా వివిధ పథకాలకు, వారి కుటుంబాల పురోగతికి ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుంది.

ఇందులో ఎన్ ఆర్ఐ లతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చు. అసలు పీ 4 వల్ల ఏమి ఉపయోగం ఉండదు అని కూడా చెప్పటం తప్పే అవుతుంది. కొంత మంది పేదలకు ఆర్థికంగా మేలు జరగవచ్చు. ఆ కుటుంబాలు బాగు పడవచ్చు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెపుతున్నట్లు దీంతో పేదరిక నిర్మూలన అన్నది జరిగే పని కాదు అన్నది అధికారుల మాట. పీ 4 తరహాలోనే చంద్రబాబు చెపుతున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 లెక్కలు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం తలసరి ఆదాయం 2.68 లక్షల రూపాయలు ఉంది. కానీ చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలో కొనసాగితే ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ తలసరి ఆదాయాన్ని 2047 నాటికి 55 లక్షల రూపాయలకు తీసుకు వెళతాం అని లెక్కలు వేసి మరీ చెపుతున్నారు.

ఇది చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ తో లక్షల కోట్ల రూపాయల ఖర్చుపెడుతున్నా కూడా ప్రస్తుతం తలసరి ఆదాయం రెండున్నర లక్షల రూపాయల పైన ఉంటే..రాబోయే సంవత్సరాల్లో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగుల కలలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 2047 నాటికి 15 శాతం జీఎస్ డీ పీ వృద్ధి రేట్ సాధిస్తే ఏకంగా రాష్ట్రంలో తలసరి ఆదాయం 55 లక్షలకు చేరుతుంది అని లెక్కలు వేసి చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సొంతంగా జీఎస్ డీపీ ని ఉరుకులు పెట్టించటానికి ప్రత్యేక మంత్ర దండాలు ఏమి ఉండవు. దేశంలో అమలు అవుతున్న విధానాల ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అమలు అవుతాయి. అందుకే చంద్రబాబు చెప్పే జీఎస్ డీపీ లెక్కలు కూడా హైప్ తప్ప ..ఏ మాత్రం వాస్తవికంగా లేవు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట.

Next Story
Share it