Telugu Gateway
Andhra Pradesh

ఇది ఆయన పాత అలవాటే!

ఇది ఆయన పాత అలవాటే!
X

తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇది పాత అలవాటే. ఇదే చంద్రబాబు గతంలో ఒకసారి తిరుపతిలో జరిగిన మహానాడు వేదికగా ఇలాంటి ప్రకటనే ఒకటి చేశారు. ప్రతి ఇంట్లో టాటా, బిర్లాలను తయారు చేస్తా అని. చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం ఎప్పటి నుంచో మంచిగా లాభాల్లో నడుస్తోంది. కానీ చంద్రబాబు మహానాడులో ఆ ప్రకటన చేసిన తర్వాత విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మరి ఆ ఐదేళ్లలో చంద్రబాబు ఎంత మంది టాటా, బిర్లాలను తయారు చేశారో ఆయనకే తెలియాలి. మళ్ళీ ఇప్పుడు ఆయన కొత్త నినాదం అందుకున్నారు. అదేంటి అంటే ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త...ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంటూ ప్రకటించారు. దీనికోసం ఒకే సారి ఆరు పారిశ్రామిక విధానాలు కూడా ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది...అదే సమయంలో ఉద్యోగ అవకాశాల కల్పన కూడా జరగాలి. ఇందులో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. జగన్ తన ఐదేళ్ల కాలంలో కేవలం పంచుడు పథకాలు తప్ప...పరిశ్రమలు తేలేదు..ఉపాధి అవకాశాలు కల్పించలేదు అని టీడీపీ ఎన్నికలు ముందు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం కూడా తెలిసిందే. ఏ రాష్ట్రంలో అయినా సంక్షేమం కొనసాగిస్తూ అభివృద్ధికి అడుగులు పడితేనే ఆ ప్రాంతం సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు కొత్తగా ప్రకటించిన లక్ష్యాలు వాస్తవికతకు దగ్గరగా ఉన్నాయా..లేక ప్రజలను ఆశల లోకంలో విహరింప చేసేలా ఉన్నాయా అన్నదే ఇక్కడ ముఖ్యం. గతంలో ఇదే చంద్రబాబు ప్రతి ఇంట్లో టాటా, బిర్లాలను తయారు చేస్తా అని చెప్పి ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేస్తాను అని చెప్పటం విశేషం. తయారు చేయటానికి పారిశ్రామిక వేత్తలు ఏమీ ఉత్పత్తులు కారు.

అసలు అది సాధ్యం కూడా కాదు. కానీ ఆ జీల్ ఉన్న వాళ్ళను గుర్తించి ప్రభుత్వ పరంగా ప్రోత్సహించటంతో పాటు వాళ్లకు మంచి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వం చేయాల్సిన పని అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. బయటకు చెప్పే మాటలకు...పలు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయి స్థాయిలో పరిస్థితులకు చాలా తేడా ఉంది అని ఆయన వెల్లడించారు. ఎవరైనా పారిశ్రామిక వేత్త వినూత్న ఐడియా తో ఒక రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయటానికి వస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఆ పారిశ్రామిక వేత్తకు సహకరించడానికి ముందే ప్రతిపాదిత ప్రాజెక్ట్ లో తమకు ఎంత వాటా ఇస్తారు అనే వాతావరణం ఉంది అని...ఎస్టాబ్లిషెడ్ ..బ్రాండెడ్ కంపెనీలకు తప్ప..కొత్తగా వచ్చే వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేయటం అంత ఈజీ కాదు అని ఆయన వెల్లడించారు.

Next Story
Share it