తిరుపతి వేదికగా 'రాజధాని రాజకీయం'
రాజధాని రాజకీయానికి తిరుపతి వేదిక అయింది. శుక్రవారం నాడు తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తొలుత సర్కారు ఈ బహిరంగ సభకు అనుమతించేది లేదని ప్రకటించింది. కానీ అమరావతి రైతులు కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. రాజధాని రైతుల బహిరంగ సభకు ముందురోజే అంటే గురువారం నాడు తిరుపతిలో రాజధాని వికేంద్రీకరణ. మూడు రాజధానులకు అనుకూలంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో విద్యార్ధులు..యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది.
ఇందులో మూడు రాజుధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుడూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం హయాంలో అమరావతి రాజధాని కోసం అంటూ రైతుల దగ్గర నుంచి వేల ఎకరాల భూ సమీకరణ చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సడన్ గా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.