ఏపీ రాజధాని తేలేది ఇక ఎన్నికల తర్వాతే!
మూడు రాజధానులు సంబంధించి న్యాయపరమైన అవరోధాలు అధిగమించకుండా కేవలం సీఎం జగన్ వెళ్లి వైజాగ్ లో ఉన్నంత మాత్రాన అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు. అలా అని వైసీపీ చెప్పుకున్నా రాజకీయ విమర్శలు ఎదుర్కోవటం తప్ప దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే ఛాన్స్ లేదనే అభిప్రాయం వైసీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి కి చెందిన కేసు లను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల విచారణ ఈ ఏడాది డిసెంబర్‌కు వాయిదా వేసింది. ఆ లోపు ఈ కేసు విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆగస్ట్ నుంచి నవంబర్ వరకూ రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని స్పష్టం చేసింది. దీంతో రాజధాని వ్యవహారం పీటముడి పడినట్లు అయింది. రాజధాని అంశాన్ని సంక్లిష్టం చేసిన జగన్ కు వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా, ప్రకాశం, పశ్చిమ గోదావరి తదితర జిలాల్లో కొంతమేర నష్టం తప్పదనే భయం వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది.