రాజధానిపై మళ్ళీ చర్చలు..అనువైన కొత్త చట్టం
ఏపీ సర్కారు రాజధాని విషయంలో మళ్ళీ మొదటికి వచ్చింది. భాగస్వాములు అందరితో మరోసారి చర్చిస్తామని..అనువైన చట్టంతో ముందుకు వస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. వికేంద్రీకరణ విషయంలో అన్ని ప్రాంతాల, ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. వికేంద్రీకరణ అన్నది ఖచ్చితంగా మనసులో పెట్టుకుని ముందుకు సాగుతామని తెలిపారు.వికేంద్రీకరణ బిల్లులకు సంబంధించి భాగస్వాములు అయిన అందరి వాదనలు సరిగా వినలేదని, దీంతోపాటు శాసనమండలిలో అభ్యంతరాలు వ్యక్తం కావటంతోపాటు సెలక్ట్ కమిటీకి పంపాలనే ప్రతిపాదన తెచ్చారన్నారు. అందుకే పాత బిల్లులురద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
తొలుత ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం నాడు శాసనసభలో సీఆర్ డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన ప్రాంతాలుగా ఉన్నాయని తెలిపారు. అభివద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపారు. బోస్టన్ కన్సల్టెన్సీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసందని తెలిపారు. బోస్టన్ కన్సల్టెన్సీ ఒక్క రాజధానే కాకుండా పలు అంశాలపై నివేదిక అందజేసిందని తెలిపారు ముంబయ్ కంటే రెండితంతల రాజధాని కడతామని గత ప్రభుత్వం గొప్పలకుపోయిందని తెలిపారు. తమ ప్రభుత్వం ముందు ఒక నిపుణుల కమిటీ, తర్వాత బోస్టన్ కన్సల్టెన్సీ వంటి వాటితో నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.