Telugu Gateway
Andhra Pradesh

ఎనిమిది నెలల్లో 15 వేల కోట్ల ఖర్చే ఇప్పుడు పెద్ద సవాల్

ఎనిమిది నెలల్లో 15 వేల కోట్ల ఖర్చే ఇప్పుడు పెద్ద సవాల్
X

ప్లానింగ్...ఎగ్జిక్యూషన్ అత్యంత కీలకం అంటున్న అధికారులు

ఒక రాష్ట్ర రాజధానిని చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించే ఛాన్స్ అందరికి దక్కదు. తొలి సారి వచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకున్న టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అమరావతి మరో ఛాన్స్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక కష్టాల్లో ఉన్నా కూడా ఈ సారి మాత్రం చంద్రబాబు కు రాజధాని నిర్మాణం విషయంలో వాతావరణం పూర్తి అనుకూలంగా మారింది అనే చెప్పాలి. ఇప్పుడు కావాల్సింది పర్ఫెక్ట్ ప్లానింగ్. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇదే ఇప్పుడు చంద్రబాబు సర్కారు సమర్ధతకు సవాల్ గా మారనుంది. ఒక్క ఏడాది లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయటం అంటే అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ మొత్తం ఖర్చు కూడా ఒక్క రాజధాని అమరావతిపైనే చేయాలి. పాత ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించుకోవడంతో రాజధాని లో అత్యంత కీలకమైన సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టు , రాజ్ భవన్ వంటి భవనాల నిర్మాణం ...వీటి చుట్టూ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తే రాజధానిలో కీలక పనులు పూర్తి అయినట్లు అవుతుంది. మరో వైపు ఇప్పటికే ప్రారంభం అయిన... ఆగిపోయిన పనులను కూడా కొనసాగించాల్సి ఉంటుంది. తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయల మేర నిధులు అందే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే. తొలుత పదిహేను వేల కోట్లు అందించే ఏర్పాటు చేసి..రాబోయే రోజుల్లో మరింత సాయం కూడా అందిస్తామని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఇంకా మిగిలి ఉన్నది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే. మరి ఎనిమిది నెలల వ్యవధిలో రాజధానిపై పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే పనులు ఎంత వేగంగా జరగాలో ఊహించుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ముందు ఉన్న సవాల్ కేంద్రం అందించే ఈ మొత్తాన్ని ఖర్చుచేయటమే అని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే సాయంతో తొలి ఏడాదిలో రాజధాని అమరావతి లో కీలక భవనాల నిర్మాణం పూర్తి చేస్తే రాబోయే సంవత్సరాల్లో మిగిలిన పనులు చేయటానికి వెసులుబాటు దక్కుతుంది. అంతే కాదు...ఒక వైపు రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగే అవకాశం ఉండటంతో ఇప్పటికే అక్కడ భూములు దక్కించుకున్న ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమ తమ కార్యాలయాల నిర్మాణ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది అని అధికారులు చెపుతున్నారు.

Next Story
Share it