Telugu Gateway
Andhra Pradesh

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే
X

పార్ల‌మెంట్ లో కేంద్రం ఏపీ రాజ‌ధానిపై కీల‌క ప్ర‌కట‌న చేసింది. బిజెపి ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో 'రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. త‌మ‌ దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే' అని వెల్ల‌డించారు. 'ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?' అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహ‌రావ్ కోరారు.

ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ స‌మాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం తొలుత మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చి త‌ర్వాత ఉప‌సంహ‌రించుకున్న విష‌యం తెలిసిందే. అయినా కూడా త్వ‌ర‌లోనే మ‌రోసారి బిల్లులు పెట్టి ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగా మూడు రాజ‌ధానుల విష‌యంలో ముందుకెళ‌తామ‌ని మంత్రులు ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తున్నారు. అయితే కొత్త బిల్లులు ఎప్పుడు వ‌స్తాయి..రాజ‌ధాని ఏర్పాటు ఎప్పుడు జ‌రుగుతుంది అన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు.

Next Story
Share it