Telugu Gateway
Andhra Pradesh

ఫస్ట్ నాదెండ్ల ..సెకండ్ నిమ్మల

ఫస్ట్ నాదెండ్ల ..సెకండ్ నిమ్మల
X

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటింది. నెల రోజుల ప్రభుత్వ పనితీరుపై అంచనా వేయటం అన్నది ఏ మాత్రం సరి కాదు. కాకపోతే ఈ నెల రోజుల్లోనే కొంత మంది మంత్రులు మాత్రం ఫుల్ యాక్షన్ మోడ్ లోకి దిగారు. మరికొంత మంది ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించే ప్రయత్నం చేయలేకపోయారు అనే చర్చ టీడీపీ వర్గాల్లో ఉంది. నెల రోజులు వ్యవధిలోనే ఫుల్ యాక్షన్ మోడ్ లోకి దిగటమే కాకుండా...ఇంప్యాక్ట్ చూపించిన మంత్రుల్లో ముందు వరసలో ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సప్లయస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన ఈ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేయటంతో పలు విషయాల్లో దూకుడుగా వ్యవరిస్తున్నారు. అదే సమయంలో ప్రజలకు ఉపయోగపడేలా రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం పౌర సరఫరాల శాఖ ద్వారా రాయితీ ధరలకు అందించే ఏర్పాటు చేశారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నాదెండ్ల మనోహర్ తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న మంత్రుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెండవ స్థానంలో ఉన్నారు అనే చెప్పాలి. ఆయన తన శాఖాపరమైన విషయాలతో పాటు ప్రతిపక్ష వైసీపీ చేసే విమర్శల విషయంలో కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చుకుంటూ దూసుకుపోతున్నారు.

గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ లను వైసీపీ ఎంత నిర్లక్ష్యం చేసింది అనే విషయాన్ని కూడా ఆయన ఎక్స్ పోజ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తన శాఖ వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత జాబితా లో ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా దర్భార్ నిర్వహిస్తూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చే సమాచారం ఆధారంగా కూడా అప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అయితే నారా లోకేష్ తన శాఖాపరమైన అంశాల కంటే అటు ప్రజాదర్బార్, ఇతర ప్రజాసంబంధ విషయాల్లో స్పందించటం ద్వారానే యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి తనయుడిగా...టీడీపీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ కు ఉండే వెసులుబాట్లు ఇతర మంత్రులకు ఉండవు అనే చెప్పాలి. నారా లోకేష్ తర్వాత ఈ జాబితా హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఉన్నారు.

ఆమె అత్యంత కీలకమైన హోమ్ శాఖను దక్కించుకోవటమే ఒక సంచలనం అయితే...బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తన శాఖాపరమైన విషయాలతో పాటు విపక్షంపై పొలిటికల్ ఎటాక్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గటం లేదు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరస సమీక్షలు పెట్టి తన శాఖలపై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్ లోకి దిగినట్లు ఎక్కడా కనిపించదు. వీళ్ళు తప్ప మిగిలిన మంత్రులు అందరూ ఇంకా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించే ప్రయత్నం చేయలేకపోయారు అనే అభిప్రాయం అయితే టీడీపీ నాయకుల్లోనే ఉంది. మిగిలిన మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖల వ్యవహారాలు చూసుకుంటున్నా ప్రభావం చూపించే పనులు చేయలేదు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. మరి రాబోయే రోజుల్లో మిగిలిన మంత్రులు ఎంత మేర తమ తమ శాఖల్లో ఇంప్యాక్ట్ చూపిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it