Telugu Gateway
Andhra Pradesh

పయ్యావుల లాంటి వాళ్లకు పెద్దపీట వేస్తారా?!

పయ్యావుల లాంటి వాళ్లకు పెద్దపీట వేస్తారా?!
X

ఐదేళ్లు రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 74 సంవత్సరాల వయసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పోరాటం రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఎంతో ముందుగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ తో కలిసి సాగటం, కూటమిలోకి బీజేపీ కూడా వచ్చేలా కృషి చేశారు. ఆయన కృషికి ఫలితం అటు జన సేన కు కూడా అంతే దక్కింది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్ల లోనూ , రెండు లోక్ సభ సీట్ల లోనూ విజయం సాధించింది. ఇది దేశంలోనే ఒక రికార్డు అనే చెప్పొచ్చు. ఈ తరుణంలో చంద్రబాబు కు మంత్రి వర్గ కూర్పు విషయంలో ఎలాంటి వత్తిడి లేదు...ఒక వేళ ఉన్నా వాటికీ అనుగుణంగా మలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటి అంటే ప్రతిపక్షంలో ఉండి..అధికార పార్టీ ఎన్ని వేధింపులకు పాల్పడినా నిలబడి పోరాడిన వాళ్లకు చంద్రబాబు ఈ సారి తన మంత్రి వర్గంలో చోటు కలిపిస్తారా..లేక ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటిలాగానే వ్యవహరిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఉదాహరణకు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లకు దక్కే అత్యంత కీలకమైన పోస్ట్ పీఏసి చైర్మన్.

ఈ విషయంలో ఎన్నో వత్తిళ్లు వచ్చినా చంద్రబాబు ఈ పదవి పయ్యావుల కేశవ్ కు ఇచ్చారు. అయితే గత ఐదేళ్ల కాలంలో కేశవ్ మధ్యలో ఒక రెండు, మూడు నెలలు తప్ప ఎప్పుడు అదికార వైసీపీ పై పోరాడింది ఏమీ లేదు అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పైగా మొన్నటి ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదం అయిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది కీలకంగా మారింది. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దీనిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి దీన్ని తీసుకెళితే...వైసీపీ ఇదే అంశంపై పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లో మాట్లాడిన అంశాన్ని టీడీపీ ని కౌంటర్ చేయటానికి వాడుకుంది. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ జరిగినా...సొంత పార్టీని ఇరకాటం నుంచి బయటపడేసే ఛాన్స్ ఉన్నా కూడా పయ్యావుల ఆ ప్రయత్నం చేయలేదు అన్నది టీడీపీ నాయకుల మాట. అంతే కాదు..ఎప్పుడైనా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఎంత సేపూ వైసీపీ ఫ్రభుత్వం అంటూ మాట్లాడారు కానీ..ఎప్పుడూ జగన్ పేరు ఎత్తి విమర్శలు చేసిన దాఖలాలు లేవు. ఇది ఒక్కటే కాదు...అత్యంత కీలకమైన పీఏసి చైర్మన్ గా ఉండి ప్రభుత్వంలోని కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి పెట్టె అవకాశం ఉన్నా కేశవ్ ఆ పని చేయలేదు. పీఏసి పోస్ట్ ను ఆయన తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు అనే వ్యాఖ్యలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో కేశవ్ ఒక రెండు , మూడు నెలలు ఆర్థిక, విద్యుత్ శాఖల అంశాలపై మాట్లాడి తర్వాత సైలెంట్ అయ్యారు అన్న విషయం తెలిసిందే.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇప్పుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఒక కీలక ఐఏఎస్ అండదండలతో బిల్స్ క్లియర్ చేయించుకుని పెద్ద ఎత్తున లబ్ది పొందినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీనికి ఆయన తన పోస్ట్ ను వాడుకున్నట్లు చెపుతున్నారు. అంతే కాదు కొంత మంది ముదురు ఎమ్మెల్యేలు అధికార వర్గంలోని కీలక పోస్టుల్లో తమ వాళ్ళను పెట్టుకుని వచ్చే ఐదేళ్లు హవా నడిపించే ప్లాన్స్ వేస్తున్నారు అని ...ఇలాంటి వాటిపై చంద్రబాబు, లోకేష్ అప్రమత్తగా ఉండాల్సిన అవసరం ఉండి అని ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గుంటూరు జిల్లా నుంచి పత్తిపాటి పుల్లారావు కు మంత్రివర్గంలో చోటు కల్పించటం అప్పటిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లు పదవిలో ఉన్న పత్తిపాటి పుల్లారావు పార్టీ ఓటమి తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు తప్ప...పార్టీ ని ఏ మాత్రం పట్టించుకోలేదు అనే విమర్శలు సొంత పార్టీ లోనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఆయన మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. గత ఐదేళ్ల అనుభవాలను చూసి అయినా సరే వైసీపీ ని ఢీకోట్టిన వారికీ ప్రాధాన్యత ఇస్తారా...లేక ఇతర మోడల్స్ ను ఫాలో అవుతారా అన్నది వేచిచూడాల్సిందే. పైగా ఇప్పుడు అసెంబ్లీ లో ప్రతిపక్షం అన్నది కూడా జీరోనే . వైసీపీ ఏకంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. సో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఓ పెద్ద గొంతుతో మాట్లాడే వాళ్లే ఉండాల్సిన అవసరం కూడా ఏమి లేదు.

Next Story
Share it