వైసీపీ ని కోలుకోలేని దెబ్బకొట్టిన కూటమి
ఎన్నికల సమయంలో ఎక్కువగా వాడుకలో ఉండే పదం సైలెంట్ వేవ్. అంటే పైకి పెద్దగా ఏమీ కనిపించకపోయినా ఫలితాల సమయంలో మాత్రం అనూహ్యమైన రిజల్ట్స్ వస్తే అప్పుడు దాన్నే సైలెంట్ వేవ్ గా అభివర్ణిస్తారు. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి అధికారంలోకి వస్తామని...ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం కూడా తమకు అనుకూలం అంటూ అధికార వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. ఎవరు ఎన్ని చెప్పినా తామే తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా చూపింది. అయితే ఇది అధికార వైసీపీకి వచ్చిన సైలెంట్ ఓటింగ్ కాదు....అటు సీఎం జగన్, ఇటు వైసీపీ పై కసితో ప్రజలు ఇచ్చిన వయలెంట్ ఓటింగ్ తీర్పు అనే విషయం ఈ ఫలితాలను చూస్తే అర్ధం అవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో...ఐదేళ్ల తర్వాత ఆ పార్టీ పరాజయం కూడా అంతే సంచలనంగా ఉంది అనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అవుట్ డేటెడ్ పొలిటిషన్ గా జగన్ విమర్శలు గుప్పించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేవలం ఇంట్లో...క్యాంపు ఆఫీస్ లో కూర్చుని బటన్ నొక్కటం తప్ప తన అప్ డేటెడ్ రాజకీయం ఏంటో ప్రజలకు చూపించటంలో విఫలం అయ్యారు. అసలు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో పాలన ఉంది అనే ఫీలింగ్ కలిగించడంలో జగన్ ఫెయిల్ అయ్యారు.
ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇది జగన్ వ్యతిరేక సునామి అనే చెప్పాలి. మరో కీలక విషయం ఏమిటి అంటే రాష్ట్ర సంపద తో పాటు పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి తాను అనుకున్న నవరత్నాల పథకాలు అమలు చేయటం తప్ప జగన్ చేసింది ఏమి లేదు. అటు జగన్, వైసీపీ నేతల తీరు ఎలా ఉంది అంటే తమకు తమ లబ్ధిదారులు ఉంటే చాలు...మిగిలిన సెక్షన్స్ తో తమకు పని లేదు అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఆ ప్రభావం ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ఎంతో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు వ్యవహరించిన తీరు వాళ్ళను షాక్ కు గురిచేసింది అనే చెప్పాలి. గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సిపీఎస్ రద్దు సంగతి పక్కన పెట్టి ప్రతి నెలా వాళ్లకు చట్టబద్ధంగా రావాల్సిన జీతాలు ఇవ్వటంలో కూడా విపరీత జాప్యం చేయటం కాకుండా...వాళ్లకు దక్కే ప్రయోజనాల విషయంలో కూడా చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. పంచుడు పథకాలు తప్ప రాష్ట్రంలో అసలు ఎలాంటి పనులు లేకపోవటంతో చేసేందుకు పనేమీ లేక కార్మికులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు పలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఇవి అన్ని కలిపి జగన్ సర్కారుపై సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో కసికి కారణం అయింది అనే చెప్పాలి. ఆ కసి ఇప్పుడు తమ ఓటింగ్ లో చూపించారు.