Telugu Gateway
Andhra Pradesh

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
X

ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎన్ని నిరసనలు వ్యక్తం అయినా సరే ప్రైవేటీకరణపై ముందుకే అని కేంద్రం చెబుతూ వస్తోంది. ప్రైవేటీకరణ..లేదంటే మూసివేతే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రులు. ఈ తరుణంలో ఏపీ సర్కారు అంతకు ముందు ప్రకటించినట్లు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానం గురువారం శాసనసభ ఆమోదం పొందింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం జగన్ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రైవేటీకరణ కాకుండా సీఎం తన లేఖలో అయిదు ప్రత్యామ్నాయాలు సూచించారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్‌ మైన్స్ కేటాయించాలని, స్టీల్‌ప్లాంట్ నష్టాల నుంచి బయట పడేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా వైజాగ్ లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Next Story
Share it