Telugu Gateway
Andhra Pradesh

ఏపీ అసెంబ్లీ జంబో విప్ ల జాబితా వచ్చేసింది

ఏపీ అసెంబ్లీ జంబో విప్ ల జాబితా వచ్చేసింది
X

గతంలో జంబో క్యాబినెట్ లు ఉండేవి. వీటిని అరికట్టేందుకు పెట్టిన నిబంధనలతో ఆ సంఖ్య పరిమితం అయింది. దీంతో లోక్ సభతో పాటు ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా కూడా సభ్యుల సంఖ్యలో క్యాబినెట్ మంత్రులు 15 శాతం మించటానికి లేదు. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో ఎన్నడూ లేని రీతిలో విప్ లను నియమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో విప్ లే ఎక్కువ అని చెప్పొచ్చు. కూటమి పార్టీలు అయిన జనసేన, బీజేపీ లతో పాటు టీడీపీ సభ్యులకు చోటు కల్పిస్తూ ఏకంగా 15 మంది విప్ లను నియమించారు. గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో విప్ లు లేరు అని చెప్పొచ్చు. సహజంగా చీఫ్ విప్ అయినా...విప్ లు అయినా సభలో ఉన్న పార్టీ లు...సభ్యుల మధ్య కో ఆర్డినేషన్, ఇతర అవసరాల కోసం నియమిస్తారు. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీలో ఉన్న నాలుగు పార్టీల్లో వైసీపీ ఒకటి అయితే...మిగిలిన మూడు పార్టీ లు అంటే...టీడీపీ , జనసేన, బీజేపీ లు ప్రభుత్వంలో భాగస్వాములే. వాస్తవానికి ఎప్పుడో జరగాల్సిన ఈ నియామకాలు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్‍గా జీవీ ఆంజనేయులు ను, ఏపీ శాసనమండలిలో చీఫ్ విప్‍గా పంచుమర్తి అనురాధ ని నియమించారు. ఏపీ అసెంబ్లీలో విప్‍లుగా ఏకంగా 15 మంది కి చోటు కల్పిస్తే వారిలో టీడీపీ నుంచి బెందాళం అశోక్, యనమల దివ్య, బోండా ఉమ, దాట్ల సుబ్బరాజు, డా.థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప, గణబాబు, PGVR నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు లు ఉన్నారు. జనసేన నుంచి విప్‍లుగా బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ బీజేపీ నుంచి విప్‍గా ఆదినారాయణరెడ్డి నియామకం చేపట్టారు. అయితే అసెంబ్లీ చీఫ్ విప్ పదవి విషయానికి వస్తే అకస్మాత్తుగా ఎక్కడా ప్రచారం లో లేని పేరు జీ వి ఆంజనేయులు తెరమీదకు రావటం టీడీపీ వర్గాలను కూడా షాక్ కు గురి చేసింది. అయితే ఈ విషయంలో తెర వెనక చాలా వ్యవహారాలు జరిగినట్లు పార్టీ నాయకులు చెపుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఆయన పని తీరు కంటే వేరే అంశాలే కీలక పాత్ర పోషించాయనే అభిప్రాయం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it