Telugu Gateway
Andhra Pradesh

టికెట్స్ ఖరారు జాప్యం వెనక ప్లాన్ ఏంటి?

టికెట్స్ ఖరారు జాప్యం  వెనక ప్లాన్ ఏంటి?
X

అసలే బీజేపీ పై ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో ఏ మాత్రం సదభిప్రాయం లేదు. దీనికి కారణాలు ఎన్నో. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి విభజన హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదా విషయంలో కూడా మోసం చేసింది అనే భావన ఎక్కువ మంది ప్రజల్లో ఉంది. విభజన సమయంలో కాంగ్రెస్ పై ఏపీ ప్రజల్లో ఎంతటి కసి ఉందో..ఆ స్థాయిలో కాకపోయినా బీజేపీ పై కూడా ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది అనే చెప్పాలి. కారణాలు ఏమైనా సరే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సీట్ల ఒప్పందం కూడా జరిగిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ కి ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారు. దీనికోసం కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన కొన్ని అసెంబ్లీ సీట్లు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. మరి ఈ తరుణంలో పొత్తు సాఫీగా ముందుకు సాగాలంటే...ఓటు ట్రాన్స్ఫర్ పక్కాగా జరగాలంటే కూటమిలో అంతా మంచిగా కుదిరింది అనే భావన అటు నాయకులూ...క్యాడర్ లో కలగాలి. కానీ కీలక పార్టీ లు అయిన టీడీపీ, జన సేన విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ లేకపోయినా కూడా బీజేపీ మాత్రం ఇంత వరకు అసలు లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. పైగా సీట్ల విషయంలో కొత్త కొత్త డిమాండ్ లు పెడుతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ సీట్లు ప్రకటించకపోవడంతో టీడీపీ కూడా గురువారం సాయంత్రం వరకు ఆ పార్టీ తరపున పోటీ చేసే లోక్ సభ అభ్యర్థులను ప్రకటించలేదు.

అసెంబ్లీ కి కూడా కొన్ని స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి టీడీపీ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇది బీజేపీ కారణంగానే ఆగింది అనే చర్చ సాగుతోంది. ఇవన్నీ కూడా ఎన్నికల్లో బీజేపీ కి ఎక్కువ నష్టం చేస్తాయనే చర్చ సాగుతుంది. ఆసలు బీజేపీ తో పొత్తే టీడీపీ లో చాలా మంది నేతలు, క్యాడర్ కు ఇష్టం లేదు. కానీ అది జరిగిపోయింది. పొత్తు ఫైనల్ అయ్యాక అంతా సాఫీగా సాగితే అందరూ హ్యాపీ గా ఉంటారు కానీ...ఏపీ లో ఏ మాత్రం బలం లేని బీజేపీ ఇన్ని సమస్యలు సృష్టిస్తే నాయకులూ..క్యాడర్ మనస్ఫూర్తిగా ఆ పార్టీ కోసం పనిచేయటం అంతా సులభం కాదు అని ఒక సీనియర్ టీడీపీ లీడర్ అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే పొత్తు లక్ష్యం నెరవేరక పోగా అధికార వైసీపీ కి లాభం చేసినట్లు అవుతుంది అనే చర్చ సాగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే పొత్తు ఖరారు తర్వాత తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చిన మోడీ చిలకలూరిపేట సభలో సీఎం జగన్ పై విమర్శలు చేయకపోవటం సంగతి అటుంచి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి..తాము ఏమీ చేస్తామో స్పష్టంగా చెప్పకపోవటం కూడా ఒక మైనస్ ఇష్యూగా మారింది అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. పొత్తు పెట్టుకుని బీజేపీ కూటమికి మేలు చేస్తుందో లేక వైసీపీ కి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తోందో అర్ధం కావటం లేదు అని కొంత మంది నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it