Telugu Gateway
Andhra Pradesh

ఒక్క మైన్ తోనే రోజుకు గరిష్టంగా 40 లక్షల ఆదాయం

ఒక్క మైన్ తోనే రోజుకు గరిష్టంగా 40 లక్షల ఆదాయం
X

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన కీలక సలహాదారు. ప్రభుత్వానికి ఆయన ఏమి సలహాలు ఇస్తారో..వాటిని ప్రభుత్వం ఏమి పాటిస్తుందో తెలియదు కానీ..ఆ పేరు చెప్పుకుని ఆయన చేస్తున్న స్వాహా చూసి అధికార వర్గాలు కూడా అవాక్కు అవుతున్నాయి. ఒక్క రంగం ఏంటి?. ఆయన వేలు పెట్టని శాఖ లేదు ..అంతా ఆయన రాజ్యమే అని చెపుతున్నారు. ప్రభుత్వంలోని ఒక కీలక అధికారి తనయుడు కూడా ముందు అనుకున్న ఐఏఎస్ టార్గెట్ ను కూడా వదిలేసుకొని ఉత్తరాంధ్ర జిల్లాల్లో మైనింగ్ తో కోట్లు దండుకుంటున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ కీలక సలహాదారు కూడా నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం మొలకలాపండ్ల గ్రామంలోని పన్నెండున్నర ఎకరాల్లో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్ లీజ్ దక్కించుకున్నారు. ఈ లీజ్ ఉండేది మాత్రం ఒకరి పేరు మీద...కానీ అసలు లబ్ధిదారులు మాత్రం ప్రభుత్వ సలహాదారు..నెల్లూరు కు చెందిన వైసీపీ కి చెందిన పెద్దా రెడ్డి ఒకరు అని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ లీజ్ ప్రాంతంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న సిద్దేశ్వర స్వామి దేవాలయంతో పాటు ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. నిత్యం ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని..మైనింగ్ లీజ్ ఇవ్వవద్దు అని కూడా కోర్ట్ కు వెళ్లారు.

తొలుత స్టే ఇచ్చినా తర్వాత సవరించిన మైనింగ్ ప్లాన్ కోర్టు ముందు ఉంచి.. దేవాలయానికి రెండు వందల మీటర్ల దూరంలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేయవద్దు అంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే ఈ ప్రాంతంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ మైనింగ్ సాగుతోంది అని స్థానికులు చెపుతున్నారు. ఈ ఒక్క మైనింగ్ ద్వారానే రోజుకు 30 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఇందులో భాగస్వాములు కావటంతో అధికారులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. ఈ మైనింగ్ ఇలాగే సాగితే ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. గిరి ప్రదక్షిణ ప్రాంతాన్ని కూడా ఆక్రమించారు. మైనింగ్ ప్రాంతం లో చేస్తున్న బ్లాస్టింగ్ ల వల్ల దేవాలయం ఉన్న కొండ ప్రాంతం దెబ్బతింటున్నది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా వీళ్లకు ఆదాయం ముఖ్యం కానీ...గుళ్ళు కాదు. ఎవరూ కూడా దీన్ని పట్టించుకునేలా లేరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it