Telugu Gateway
Andhra Pradesh

అటవీ భూములు ఆక్రమించిన గ్రీన్ కో పై ప్రశంసలా?!

అటవీ భూములు ఆక్రమించిన గ్రీన్ కో పై ప్రశంసలా?!
X

పవన్ తీరుతో అధికారుల విస్మయం

అటవీ చట్టాలను అడ్డగోలుగా ఉల్లఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ గ్రీన్ కో. అలాంటి కంపెనీ ని గ్రీన్ కో ఇక కాస్కో అనాల్సిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం మీకు నచ్చినట్లు చేసుకోండి అన్న సంకేతాలు ఇవ్వటం వెనక మతలబు ఏంటి?. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ప్లాంట్ ను సందర్శించి ..వాళ్లపై ప్రశంసలు కురిపిస్తే ఇక అటవీ శాఖ అధికారులు ఈ కంపెనీ విషయంలో నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళగలరా అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్ట్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఏమి చేస్తున్నారు అంటూ కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గ్రీన్ కో కంపెనీ అటవీ చట్టాలకు తూట్లు పొడిచి అక్రమ నిర్మాణాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ వాళ్లపై ఒక్క మాట కూడా మాట్లాకుండా ఉండటం ఒకెత్తు అయితే.. కంపెనీ పై ఏకంగా ప్రశంసలు కురిపించటం అటవీ శాఖ అధికారులను కూడా షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి.

ఇటీవలే పవన్ కళ్యాణ్ గ్రీన్ కో ప్రాజెక్ట్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలే కాదు...గ్రీన్ కో కంపెనీ కర్నూలు లో ఏకంగా 140 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మాములుగా అయితే పవన్ కళ్యాణ్ అక్రమాలకు పాల్పడితే తాట తీస్తా...చమడాలూ వలుస్తా అంటూ డైలాగులు చెపుతారు. కానీ అందుకు భిన్నంగా గ్రీన్ కో కంపెనీ విషయంలో వ్యవహరించటం కీలక పరిణామంగా మారింది. దీని వెనక ఏమి జరిగి ఉంటుంది అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే రాజకీయంగా చూస్తే టీడీపీ, వైసీపీ లు బద్దవిరోధులుగా ఉంటాయి. కానీ గ్రీన్ కో లాంటి కంపెనీల విషయానికి వస్తే ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు సేఫ్ జోన్ లోనే ఉంటారు. దీనికి ప్రధాన కారణం ప్రమోటర్లు రాజకీయాన్ని కూడా ఎప్పటికప్పుడు అలా షిఫ్ట్ చేస్తుంటారు మరి.

ఇక అసలు విషయానికి వస్తే అటవీ భూముల్లో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే రోడ్లు వేయాలన్నా కూడా సవాలక్ష అనుమతులు తీసుకోవాలి...అయినా కూడా అంత ఈజీ గా పనులు కావు. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రం అటవీ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుని వాటిలో తమ కంపెనీకి అవసరమైన పలు నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. అలాంటి కంపెనీ సందర్శనకు వెళ్లిన అటవీ శాఖను పర్యవేక్షించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐ.ఆర్.ఇ.పి.) మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికే ఈ ప్రాజెక్ట్ ఆదర్శం అంటూ కొనియాడారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఏ కంపెనీ అయితే అటవీ భూములను ఆక్రమించింది అని ఆరోపణలు ఎదుర్కొంటుందో...ఆ కంపెనీ సందర్శనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ ఎవరైతే ప్రభుత్వ, అటవీ భూములు అక్రమించారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పటం విశేషం. గ్రీన్ కో కంపెనీ ఎలాంటి అటవీశాఖ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేయటంతో పాటు కొండల్ని తవ్వేసి పిప్పిపిప్పి చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు పనులు చేసే కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లు వేశారు..దీంతో పాటు యంత్రసామాగ్రి నిలిపేందుకు నిర్మించిన తాత్కాలిక గ్యారేజీలకూ అటవీశాఖ నుంచి అనుమతి లేదు అని సమాచారం. ఇదే విషయాన్ని కర్నూలు అటవీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

ఇవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గ్రీన్ కో పై ప్రశంసలు కురిపించటంతో అధికారులు ఈ కంపెనీ విషయంలో ఇక ఎలా నిష్పక్షపాతంగా వ్యవహరించగలరు అన్న సందేహాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ డబల్ గేమ్ స్పష్టంగా కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక వైపు ఆయనే అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుంటే మీరు ఏమి చేస్తున్నారు అని టీడీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం అటవీ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న...అక్రమ నిర్మాణాలు చేసిన కంపెనీపై ప్రశంసలు కురిపించి అందరిని షాక్ కు గురి చేశారు అనే చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ కు నచ్చితే ఒకలా..లేకపోతే మరోలా వ్యవహరిస్తారు అన్న మాట.

Next Story
Share it