అంబటి వర్సస్ బాలకృష్ణ

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం నాడు హాట్ హాట్ గా ప్రారంభం అయ్యాయి. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరగటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చ కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. అసలు స్పీకర్ తమ్మినేని సీతారాం బయటకు కనిపించకుండా చుట్టుముట్టారు. ఆయనపై పేపర్ లు విసిరేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీనిపై మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు వల్ల తమ సభ్యులు కూడా రెచ్చిపోతే అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది అని..ఇలా రెచ్చ కొట్టే పనులు చేయవద్దు అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రెచ్చకొడితే తమ వాళ్ళు రెచ్చిపోతారు అని...తర్వాత జరిగే పరిణామాలకు తమకు బాధ్యత ఉండదు అంటూ హెచ్చరించారు.
అంబటి రాంబాబు మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడ గొట్టి, మీసం తిప్పగా...బాలకృష్ణ మీసాలు సినిమాల్లో తిప్పుకోవాలని...ఇక్కడ కాదు అంటూ అంబటి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే చూసుకుందా రా అంటూ అంబటి రాంబాబు సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధసూధన్ రెడ్డి కూడా తొడ గొట్టారు. ఒక వైపు టీడీపీ, మరో వైపు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో పరిస్థితి చేయే దాటే అవకాశం ఉండటంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను వాయిదా వేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయి టీడీపీ వైపు వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి లు పోడియం వద్ద దూకుడుగా వ్యవహరించటంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసు లపై హై కోర్టు , సుప్రీమ్ కోర్ట్ ల్లో చూసుకోవాలని...స్పీకర్ పోడియం వద్ద బల్లలు కొడితే ఏమి కాదు అంటూ అంబటి వ్యాఖ్యానించారు.