Telugu Gateway
Andhra Pradesh

తెలంగాణ టూ ఏపీ

తెలంగాణ టూ ఏపీ
X

ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ కి సెక్రటరీ మాత్రమే ఉండేవాళ్ళు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రభుత్వాలు కొత్త కొత్త సంప్రదాయాలను తెరమీదకు తీసుకువస్తున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువుతీరిన తర్వాత శాసనసభ వ్యవహారాలపై మంచి పట్టు ఉంది అనే కారణంతో సూర్యదేవర ప్రసన్న కుమార్ ను తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా నియమించింది. ప్రసన్న కుమార్ గతంలో లోక్ సభ స్పీకర్ దగ్గర ఓఎస్డీగా, ఉప రాష్ట్రపతి కార్యాలయంలో డైరెక్టర్ గా కూడా పనిచేశారు. శాసన, కార్యనిర్వహణ వ్యవస్థల విషయంలో విశేష అనుభవం ఉంది అనే కారణంతో తెలంగాణ సర్కారు ఆయన్ను సలహాదారుగా నియమించుకుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా ఉన్న సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులు కానున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబదించిన ఆదేశాలు కూడా ఒకటి, రెండు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రిటైర్ అయిన అధికారి రామాచార్యులును అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా కొనసాగించింది.

రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో ఆయన తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా మరో రిటైర్ అయిన అధికారి సూర్యదేవర ప్రసన్న కుమార్ ను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయటంపై అసెంబ్లీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా ఎప్పటికప్పుడు తమ పదోన్నతులు దెబ్బతినేలా రిటైర్ అయిన వాళ్ళను తీసుకురావటం,,కీలక స్థానాల్లో కూర్చోబెట్టడం సరికాదు అని వాళ్ళు వాపోతున్నారు. సూర్యదేవర ప్రసన్న కుమార్ ను తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకురావటం వెనక జంట కవులుగా పేరున్న వాళ్ళు కీలక పాత్ర పోషించినట్లు ఏపీ అసెంబ్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీళ్ళు ఒక ఎజెండా ప్రకారమే ఈ పని చేస్తున్నట్లు చెపుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ తొలి సర్కారులోనే ఆయన అసెంబ్లీ సెక్రటరీ పదవి కోసం ప్రయత్నాలు చేసినా అప్పటిలో అది సాధ్యం కాలేదు అని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సారి ప్రయత్నం మాత్రం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే ఆయనకు ఏ హోదా ఇస్తారు అనే విషయం జీ ఓ జారీ అయితే కానీ తెలియదు.

Next Story
Share it