భూమి ఏపీఐఐసీది...అభివృద్ధి..నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది

ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ). ఈ సంస్థ పనే పారిశ్రామిక పార్క్ ల అభివృద్ధి..పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించటం. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏపీఐఐసీ చేయాల్సిన పనిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రెడీ అయింది. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే భూమి ప్రభుత్వానిది అంటే ఏపీఐఐసీది..కానీ మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసేది మాత్రం ప్రైవేట్ సంస్థలు అన్న మాట. దీని వల్ల పారిశ్రామికవేత్తలకు అదనపు భారం పడుతుంది తప్ప...పెద్దగా ఉపయోగం ఉండదు అన్నది పరిశ్రమల వర్గాల అభిప్రాయం. ఇదే పని ఏపీఐఐసీ చేస్తే ఇండస్ట్రియల్ పార్క్ ల్లో ప్రైవేట్ సంస్థలకు కేటాయించే భూముల ధర అంత ఎక్కువ గా ఉండదు. కానీ ఇదే పని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఇది కచ్చితంగా పారిశ్రామికవేత్తలకు భారంగా మారుతుంది..భూమి రేట్ కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో పది చోట్ల రెండు వందల నుంచి ఐదు వందల ఎకరాల్లో కొత్తగా పారిశ్రామిక పార్క్ లను అభివృద్ధి చేయటంతో పాటు నిర్వహణ, వీటి బాధ్యతల పర్యవేక్షణ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో అప్పగించనున్నారు.
ఎంపిక చేసిన ప్రైవేట్ సంస్థకు ఎలాంటి వివాదాలు లేని భూములను అప్పగిస్తారు. ఒక్కో పార్క్ ను తక్కువ లో తక్కువ 200 ఎకరాల్లో వేసుకున్నా కూడా పది పార్క్ లకు కలిపి 2000 ఎకరాలకు పైన ఏపీఐఐసీ భూములు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోబోతున్నాయి అన్న మాట. ఇందులో సగం అంటే ఐదు పార్క్ లు 500 ఎకరాల్లో అభివృద్ధి బాధ్యతలు అప్పగించినా కూడా ఈ మొత్తం 3500 ఎకరాలకు చేరుతుంది. పీపీపీ విధానంలో పారిశ్రామిక పార్క్ ల అభివృద్ధికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్స్ కోరుతూ ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ (ఈఓఐ) జారీ చేశారు.
ఆసక్తి ఉన్న సంస్థలు తమ ప్రతిపాదనలను జూన్ ఆరవ తేదీ లోగా సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే ఇది అంతా కూడా ఒక ముందస్తు ప్రణాళికలో భాగంగానే తెరమీదకు తెచ్చారు అనే అనుమానాలు అధికార వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. నిజంగా కొత్తగా పది చోట్ల పారిశ్రామిక పార్క్ లు అభివృద్ధి చేయాలనుకుంటే ..ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నా ఆ స్థలాన్ని తనఖా పెట్టి ఏపీఐఐసీ తోనే ఆ పని చేయించవచ్చు అని..కానీ అలా చేయకుండా పీపీపీ మోడల్ ఎంచుకున్నారు అంటేనే దీని వెనక ఏదో స్కెచ్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని అధికారి వెల్లడించారు. మరి ఏపీఐఐసీ కొత్తగా పిలిచిన ఈఓఐ ప్రకారం ఈ పార్క్ లను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.