Telugu Gateway
Andhra Pradesh

మళ్ళీ అదే మోడల్ ఫాలో అవుతారా?!

మళ్ళీ అదే మోడల్ ఫాలో అవుతారా?!
X

ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు అధికారంలోకి వచ్చేది వైసీపీనే అంటున్నారు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయింది...ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది అని కూడా ఆరోపిస్తున్నారు. కాసేపు జగన్ చెప్పిందే నిజం అనుకుందాం. మరి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తున్నాం అని చెపుతున్న జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు అత్యంత కీలకమైన రాజధాని విషయంలో తన వైఖరి చెపుతారా?.లేకపోతే ఎప్పటిలాగానే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. కారణాలు ఏమైనా కూడా ఇప్పుడు శనివారం నాడు అంటే మార్చి 28 న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయి అమరావతి శాశ్వత రాజధాని గా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపబోతున్నారు. గురువారం నాడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయటం...శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు అంతా కూడా కేంద్రం సూచనల మేరకు జరుగుతుంది అనే విషయం స్పష్టం. పార్లమెంట్ లో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేసి అమరావతికి చట్టబద్దత కల్పించబోతున్నారు.

వాస్తవానికి రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి...పార్లమెంట్ కు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు...కేంద్రంలో...రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పొచ్చు. మరో కీలక విషయం ఏమిటి అంటే రాజధానిఅమరావతి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయల మేర వివిధ సంస్థల నుంచి రుణాలు కూడా ఇప్పిస్తోంది. భూములు ఇచ్చిన రైతులకు భరోసా కల్పించటంతో పాటు ఈ రుణాల విషయంలో కూడా భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పిలిచిన టెండర్లు...గతంలో పూర్తి చేసిన పనుల విలువే ఈ మూడేళ్లు పూర్తి అయ్యే లోపు దగ్గర దగ్గర డెబ్భై వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంత ఖర్చు చేస్తున్న తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి నుంచి కానీ..వైసీపీ నుంచి కానీ అమరావతి విషయంలో స్పష్టంగా ఒక ప్రకటన అంటూ రాకపోతే అది ఖచ్చితంగా ప్రజల్లో గందరగోళం కొనసాగేందుకు కారణం అవుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

మరో వైపు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేకే రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకున్నారు. ఎక్కడ వరకో ఎందుకు తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి ఇళ్లు కట్టుకున్న సమయంలో కూడా ఆ పార్టీ కి చెందిన నేతలు అంతా కూడా చంద్రబాబుకు రాజధానిలో కనీసం ఇల్లు కూడా లేదు...తమ నేత ఇక్కడ ఇల్లు కట్టుకుని రాజధాని ఎందుకు మారుస్తాడు అంటూ మీడియా ముందు మాట్లాడారు. తర్వాత ఇవన్నీ తూచ్ అన్నారు. ఒకప్పడు మాట తప్పడు..మడమ తిప్పడు అంటూ అంటూ బ్రాండింగ్ వేయించుకున్న జగన్ మోహన్ రెడ్డి ఒక్క అమరావతి విషయంలోనే కాకుండా..మండలి రద్దు వంటి ఎన్నో కీలక విషయాల్లో మాట మార్చారు. తానే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తానని చెపుతున్న జగన్ ఇంతటి కీలక సమయంలో రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశంతో పాటు మరి కొన్ని జిల్లాల్లోరాజకీయంగా వైసీపీ కి ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే ఆందోళన ఆయా జిల్లాల వైసీపీ నేతల్లో ఉంది.

వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా కూడా దీన్ని ఎవరూ నమ్మే అవకాశం లేదు అనే చెప్పొచ్చు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి చెందిన రాజధాని వంటి కీలక అంశంలో అసెంబ్లీ లో తన వైఖరి చెప్పకపోతే ఇంతకంటే రాజకీయం మరో తప్పిదం ఉండదు అని ఆ పార్టీ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. అమరావతి టెండర్లలో జరిగే అక్రమాలు..అవినీతిపై ప్రతిపక్ష పార్టీ గా వైసీపీ లేవనెత్తవచ్చు...విమర్శలు చేయవచ్చు. కానీ రాజధాని విషయంలో ఎప్పటిలాగానే ద్వంద వైఖరి కొనసాగిస్తే మాత్రం కూటమి ప్రభుత్వానికి జగన్ రాజకీయంగా కీలక అస్త్రాన్ని ఇచ్చినట్లు అవుతుంది అనే అభిప్రాయం వైసీపీ నేతల్లో కూడా ఉంది. అయినా జగన్ తన వైఖరి మార్చుకుంటారు అని తాము అనుకోవటం లేదు అని వైసీపీ కి చెందిన మాజీ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు.

Next Story
Share it