పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత

ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత ఇప్పుడు పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకంటే అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కాబట్టి. ఈ పని కూడా చేయించుకోకపోతే...అమరావతి రైతులకు భరోసా ఇవ్వకపోతే అంత కంటే పెద్ద అవమానం మరొకటి ఉండేది కాదు. పార్లమెంట్ లో రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించటం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి ముగింపు వస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో భవిష్యత్ లో అధికారంలోకి వచ్చే వాళ్ళు రాజధాని మార్పు చేయాలంటే అంత ఈజీగా ఉండదు అనే విషయం స్పష్టం. దీనికి ప్రధాన కారణం ఏకంగా పార్లమెంట్ లో గతానికి భిన్నంగా ఒక రాష్ట్ర రాజధాని విషయాన్ని విభజన చట్టంలో సవరణ చేయటం ద్వారా పొందుపర్చటమే. ఇంత వరకు అంతా బాగానే ఉంది. వాస్తవానికి రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఉన్న అతి పెద్ద సవాల్ ఏంటి అంటే వచ్చే ఎన్నికల నాటికి అమరావతిలో ఇప్పుడు చేస్తున్న పనులు అన్నీ కూడా పూర్తి చేయటమే.
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు అమరావతిలో సెక్రటేరియట్ టవర్స్ అన్నా పూర్తి చేయాలని కోరినా పెద్దగా పట్టించుకోలేదు అని టీడీపీ నేతలే చెపుతారు. ఫస్ట్ టర్మ్ లో చేసిన తప్పులు ఇప్పుడు మళ్ళీ పునరావృతం కాకుండా 2028 చివరినాటికి ఇప్పుడు టేకప్ చేసిన పనులు అన్నీ పూర్తి చేసి రాజధానికి ఒక రూపు తీసుకురావటమే అసలు సిసలు అయినా టాస్క్ అని ఎక్కువ మంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తరచూ సీఆర్ డీఏ కమిషనర్ల మార్పు తో పాటు ఇప్పుడు అమరావతిలో సాగుతున్న పనుల వేగం ప్రకారం చూస్తే షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయటం అంత ఈజీ కాదు అని మున్సిపల్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం వర్షాకాలంలో కూడా పనుల ప్రోగ్రెస్ ఉంటుంది అని లెక్కలు వేశారు అని...అమరావతిలో భారీ వర్షాలు కురిసిన సమయంలో పనులు ఏ మాత్రం ముందుకు సాగవు అనే విషయాన్ని విస్మరించినట్లు అధికారులు చెపుతున్నారు.
పార్లమెంట్ సాక్షిగా చట్టబద్దత వచ్చినందున ఇప్పుడు అయినా అమరావతి విషయంలో జెట్ స్పీడ్ లో వెళితే తప్ప పనులు పూర్తి కావటం సాధ్యం కాదు అని అధికార వర్గాలు చెపుతున్న మాట. ఎన్నికల నాటికి కూడా ఇంకా పనులు పెండింగ్ లో ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మళ్ళీ వ్యవహారం మొదటికి వస్తుంది అని ఒక సీనియర్ నేత కూడా అభిప్రాయపడ్డారు. అమరావతి విషయంలో హడావుడి చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా ఇప్పటికే టెండర్లు పిలిచి...కేటాయించిన పనులు అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలంటే దీని కోసమే ప్రత్యేకంగా అధికారులతో పాటు రాజకీయ నేతలతో కూడా ఒక టీం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వీటి ప్రోగ్రెస్ ను పర్యవేక్షించేలా ఏర్పాటు చేస్తే తప్ప లక్ష్యం సాధించటం అంత ఈజీ కాదు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది.
గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ఈ సారి పనులు తాను అనుకున్నట్లు...అనుకున్న కంపెనీలకు అప్పగించి వదిలేస్తున్నారు అని...వీటిని గతంలో లాగా మానిటర్ చేయటంలేదు అనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. పాత వాటిని పక్కన పెట్టి ఎంత సేపూ కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారు అని...అందులో భాగంగా పుట్టుకొచ్చిందే రాజధాని సెకండ్ ఫేజ్ అని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతి పనులు మొదలు పెట్టిన ఫస్ట్ టర్మ్ లో కానీ...రెండవ సారి అధికారంలోకి వచ్చే వరకు అసలు ఎక్కడ వినిపించని రెండవ దశ వెనక భారీ ఎజెండా ఉంది అనే చర్చ టీడీపీ నేతల్లో కూడా ఉంది. రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి తొలి దశలో పూలింగ్ లో తీసుకున్న భూములతోనే సింగపూర్, ఇస్తాంబుల్ తో పాటు ప్రపంచంలోని పలు దేశాల మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కానీ సడన్ గా ఆయన అమరావతి రెండవ దశ లేకపోతే మాత్రం ఈ ప్రాంతం ఒక మున్సిపాలిటీ గా మిగిలిపోతుంది అని కొత్త రాగం అందుకున్నారు. రెండవ దశ కింద గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ చేపడతామని చెపుతున్న విషయం తెలిసిందే. మరి తొలిదశ ప్రాజెక్ట్ ను ఎంత విజయవంతంగా పూర్తి చేసి రెండవ దశ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎలాంటి నమ్మకం కల్పిస్తారో చూడాలి. ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు కూటమి సర్కారు ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బుధవారం నాడు అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు లోక్ సభలో ఆమోదం పొందగా...గురువారం నాడు రాజ్య సభ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత వచ్చినట్లు అవుతుంది.



