అమరావతి ఫేజ్ 2 రైతుల నుంచి వస్తున్న ప్రశ్న!

అదనపు భూముల విషయంలో పెరుగుతున్న వ్యతిరేకత
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు వేస్తున్న ప్రశ్న ఇప్పుడు వాళ్ళకే ఎదురవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కొంత మంది పారిశ్రామిక వేత్తలు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రారు అని గ్యారంటీ ఏంటి అంటూ తమను ప్రశ్నిస్తున్నారు అని వీళ్ళిద్దరూ నిన్న మొన్నటి వరకు పదే పదే ఇదే చెపుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ప్రశ్న కొన్ని చోట్ల రైతుల దగ్గర నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వ అధికారులకు ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అమరావతి రెండవ దశ విస్తరణ కోసం దగ్గర దగ్గర నలభై వేల ఎకరాల వరకు సంకీకరించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మంచిపల్ శాఖ మంత్రి మంత్రి నారాయణ పలు మార్లు అధికారికంగా చెప్పారు. రైతులు పూలింగ్ కింద తమ భూములు ఇస్తే ఓకే..లేకపోతే భూసేకరణ చట్టం కింద అయినా సరే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం భూములు తీసుకుంటామని చెపుతూ వస్తున్నా విషయం తెల్సిందే.
దీని కోసం రాజధాని ప్రాంతంలో పలు చోట్ల గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాల్లో కొంత మంది పూలింగ్ కు భూములు ఇవ్వటానికి ఒప్పుకుంటున్నా ఎక్కువ మంది మాత్రం గత అనుభవాల దృష్ట్యా తాము ఇప్పుడు భూములు ఇవ్వటానికి రెడీ గా లేము అని తేల్చిచెపుతున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. అమరావతి తొలి దశ ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విస్తరణ గురించి ఆలోచించవచ్చు అని...వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారే తిరిగి అధికారంలోకి వస్తుంది అని గ్యారంటీ ఏంటి అని కొంత మంది రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత టర్మ్ లో అమరావతి రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం అని..తాము మరో సారి రాజకీయాలకు బలి కావాలి అని కోరుకోవటం లేదు అంటూ కొంత మంది రైతులు కుండబద్దలు కొట్టినట్లు తేల్చిచెపుతున్నారు. కూటమి సర్కారు తిరిగి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు ప్లాన్స్ ను తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎందుకు అమలు చేస్తాయని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద దగ్గర దగ్గర 35 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు పదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. వాళ్లకు దక్కిన ఫ్లాట్స్ కు మంచి రేట్లు రావాలన్నా కూడా తొలి దశ అమరావతి పూర్తి అయితే కానీ సాధ్యం కాదు. ఈ దశలో తాము ప్రభుత్వం చెప్పిన మాటలు విని మరో సారి అనిశ్చితిలోకి వెళ్లాలనుకోవటం లేదు అన్నది ఎక్కువ మంది రైతుల అభిప్రాయంగా ఉన్నట్లు చెపుతున్నారు. పైకి ఏమీ చెప్పకపోయినా కూడా కూటమి ప్రభుత్వం మాత్రం అదనపు భూమి విషయంలో తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. అవసరం అయితే భూసేకరణ చట్టాన్ని ఉపయోగించటానికి కూడా వెనకాడం అని మంత్రి నారాయణ పదే పదే చెపుతున్న విషయం కూడా తెలిసిందే.