ఫస్ట్ ఫేజ్ కంటే విస్తరణ ప్రాజెక్ట్ కే మెగా మాస్టర్ ప్లాన్

అసలు కంటే కొసరుకే ఎక్కువ అనే సామెత దీనికి బాగా అతికినట్లు సరిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు..ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ఆయన అనుసరిస్తునానఁ వైఖరి సొంత పార్టీ నాయకులకు కూడా అంతు చిక్కటం లేదు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పనులు ఇప్పుడు ఒకింత వేగంపెరిగినా కూడా ...ఈ మూడేళ్ళలో ఇది ఒక షేప్ తీసుకోవాలంటే మాత్రం ఈ స్పీడ్ ఏ మాత్రం సరిపోదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. మరో వైపు రాజధానికి చట్టబద్దత కల్పించేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్ లో బిల్లు పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇవి అన్నీ కూడా రాజధానికి సానుకూల అంశాలే. కానీ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినన్ని చాలా ఉన్నాయి అనే వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి.
ఈ తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం...సిఆర్డీఏ అమరావతి విస్తరణ ప్రాజెక్ట్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించేందుకు రంగంలోకి దిగింది. దీని కోసం కన్సల్టెంట్స్ ను ఆహ్వానిస్తూ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మొదటి దశ మాస్టర్ ప్లాన్ మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. అంటే ఈ మొత్తం ఎకరాల్లో చూసుకుంటే 53621 ఎకరాలు. ఇప్పుడు విచిత్రంగా ..అమరావతి విస్తరణ కోసం అంటూ ఏకంగా 709.6 చదరపు కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించుతున్నారు. అంటే ఫస్ట్ ఫేస్ కేవలం 217 చదరపు కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించితే ...విస్తరణ కోసం ఇప్పుడు ఏకంగా 709 చదరపు కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ అని చెప్పటం పెద్ద చర్చనీయాంశగా మారింది. ఇది మొత్తం 50 గ్రామాలు...1.75 లక్షల ఎకరాలు కవర్ అయ్యేలా ఉంటుంది.
అమరావతి రెండవ దశలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ వంటి వాటిని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. ప్రస్తుతం రెండవ దశ భూ సమీకరణ కింద పదహారు వేల ఎకరాలకు పైగా భూమి తీసుకుంటున్నా కూడా...రాబోయే రోజుల్లో ప్రభుత్వం రెండవ దశ కోసం మరింత భూ సమీకరణ చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని అధికారులు చెపుతున్నారు. వాస్తవానికి రెండవ దశ భూ సమీకరణ దగ్గర దగ్గర 44 వేల ఎకరాలు ఉంటుంది అని ప్రభుత్వం తొలుత లీకులు ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో తర్వాత ఈ మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించారు. తర్వాత ప్రభుత్వం అనుకున్న చందంగా తన ప్లాన్ ను అమలు చేసే అవకాశం లేకపోలేదు.



