Telugu Gateway
Andhra Pradesh

బిడ్ కెపాసిటీ సమస్యతో కొత్త కంపెనీలు రంగంలోకి!

బిడ్ కెపాసిటీ సమస్యతో కొత్త కంపెనీలు రంగంలోకి!
X

కానీ పనులు మాత్రం పెద్దలు ఎవరికీ చెపితే వాళ్ళకే!

మరో పదిహేను రోజులు అయితే మే నెల పూర్తి అవుతుంది. వచ్చేది వర్షాకాలమే. వర్షాకాలంలో నిర్మాణ పనులు అంత వేగంగా ముందుకు సాగవు అనే విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులను పునః ప్రారంభించారు. ఇక నుంచి పనులు పరుగులు పెట్టడమే అని చెప్పుకొచ్చారు కూడా. కానీ ఇంతవరకు అమరావతిలోని అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్ల కు సంబంధించిన టెండర్లు ఫైనల్ కాలేదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. వాస్తవానికి ప్రధాని మోడీ పర్యటనకు ఒక రోజు ముందు అంటే మే 1 నే సాంకేతిక బిడ్స్ ఓపెన్ చేయాల్సి ఉంది. కానీ టెండర్ల గడువును మే ఐదు వరకు పొడిగించారు. మే 7 నే ఫైనాన్సియల్ బిడ్స్ కూడా ఓపెన్ చేసి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది అని అధికార వర్గాలు తెలిపాయి. కానీ ఇప్పటి వరకు ఇది కాలేదు. అత్యంత విలువైన వేల కోట్ల రూపాయల పనులను ఎవరికీ ఇవ్వాలో ముందే నిర్ణయించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

కానీ చివరి నిమిషంలో అస్మదీయ సంస్థలకు చెందిన బిడ్ కెపాసిటీ సరిపోకపోవడంతో కొత్త చిక్కు వచ్చిపడినట్లు చెపుతున్నారు. బిడ్ కెపాసిటీ అంటే నిర్దేశిత సమయంలో పనులు చేసేందుకు ఆయా కాంట్రాక్టు సంస్థ కు ఉన్న ఆర్థిక సామర్థ్యం, గతంలో చేసిన ప్రాజెక్ట్ విలువలు...ఇప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు తదితర అంశాలు వస్తాయి. టెండర్ల కంటే ముందే కూటమి ప్రభుత్వం ఈ ఐకానిక్ టవర్స్ పనుల్లో జీఏడీ టవర్ ను దేశంలోని ఎంతో పేరున్న ఒక నిర్మాణ సంస్థకు కట్టబెట్టాలని...టవర్ 2 , 3 పనులను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఒక లిస్టెడ్ కంపెనీ కి ఇవ్వటానికి అంతా సిద్ధం అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. టవర్ 1 , 2 పనులకు ఇప్పటికే అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు దక్కించుకున్న బెంగళూరు కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థకు కేటాయించటానికి అంతా సిద్ధం చేశారు అని చెపుతున్నారు. అయితే బెంగళూరు సంస్థతో పాటు హైదరాబాద్ కు చెందిన లిస్టెడ్ సంస్థకు అమరావతిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులు కేటాయించినందున వీటి బిడ్ కెపాసిటీ మించిపోయింది అని..అందుకే నేరుగా కాకపోయినా పరోక్షంగా ఈ సంస్థలకు పనులు కేటాయించేందుకు గతంలో అమరావతి లో పనులు దక్కించుకున్న మరో ప్రముఖ నిర్మాణ సంస్థను రంగంలోకి దింపారు అని సమాచారం.

పేరు ఆ సంస్థది ఉన్నా పనులు చేసేది మాత్రం ప్రభుత్వం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు మాత్రమే అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక అధికారి వెల్లడించారు. ఇప్పటికే వీటి ఖరారులో జాప్యం అయినందున ఒకటి, రెండు రోజుల్లో ఈ టెండర్లు ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఏపీసిఆర్ డీఏ కొద్ది రోజుల క్రితమే ఈ ఐదు టవర్ ల నిర్మాణాన్ని టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. జీఏడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్ లు ఉంటాయి. ఈ ఒక్క టవర్ నిర్మాణ వ్యయం 1126 కోట్ల రూపాయలుగా ఉంది. సచివాలయంలో భాగంగా నిర్మించే టవర్ 1 , 2 ల నిర్మాణ వ్యయం 1897.86 కోట్లు, టవర్ 3 , 4 ల నిర్మాణ వ్యయం 1664 కోట్ల రూపాయలుగా ఉంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించనున్న ఈ ఐదు టవర్లు కలుపుకుంటే మొత్తం నిర్మాణ వ్యయం 4668 .82 కోట్ల రూపాయలు కానుంది. పనుల పంపకాలు , సర్దుబాటు సమస్యల కారణంగానే టెండర్ల ఖరారులో జాప్యం జరుగుతుంది తప్ప..మరొకటి కాదు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it