ల్యాండ్ పూలింగ్ నిర్ణయం ఆగింది అందుకే !

ఫస్ట్ టైమ్ జనసేన కూటమి ప్రభుత్వంలో ఒక కీలక నిర్ణయానికి బ్రేకులు వేయించగలిగింది. అయితే ఇది తాత్కాలికమే అవుతుందా లేక శాశ్వతం అవుతుందా అన్నది తేలాలంటే మాత్రం కొద్దికాలం ఆగాల్సిందే. ఎన్నికల ముందు కానీ..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అసలు అమరావతి విస్తరణ ప్రాజెక్ట్ అన్నది ఎక్కడా ప్రస్తావనే లేదు. అన్ని పార్టీ లు చెప్పిన మాట ఆగిపోయిన అమరావతి ప్రోఎజెక్ట్ ను పట్టాలు ఎక్కిస్తామని మాత్రమే. కానీ సడన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి విస్తరణ కోసం ఏకంగా మరో 42000 వేల ఎకరాలను సమీకరించాలనే ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చారు . ఇది చూసి సొంత పార్టీ నేతలు కూడా విస్మయానికి గురి అయ్యారు. ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వటానికి అప్పులు అన్నీ సెట్ కావటంతోనే చంద్రబాబులో విస్తరణ ప్రాజెక్ట్ ...అదనపు భూమి ఆలోచనలు పుట్టుకొచ్చాయి టీడీపీ వర్గాలు కూడా వెల్లడించాయి.
దీనికి కొద్దిరోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మాత్రం ఈ ప్రతిపాదనను సగానికి సగం తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ భూముల లెక్కలపై ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తుంది అనే విమర్శలు కూడా లేకపోలేదు. అయితే జులై 9 న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మాత్రం అమరావతి విస్తరణ ప్రాజెక్ట్ భూసేకరణపై జన సేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నాదెండ్ల మనోహర్ లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితికి ప్రభుత్వం చెప్పే దానికి మధ్య గ్యాప్ ఉంది అని...అదే సమయంలో ముందు రాజధానికి భూములు ఇచ్చిన వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి తర్వాత ఇలాంటి వాటి విషయంపై దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పటంతో ఈ నిర్ణయానికి బ్రేక్ పడినట్లు చెపుతున్నారు.
అయితే ఈ అంశాన్ని మంత్రి వర్గ ఉప సంఘం లో విస్తృతంగా చర్చించి తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవటంతో దీనికి జనసేన బ్రేకులు వేసినట్లు అయింది. పవన్ కళ్యాణ్ గతంలో రాజధాని అమరావతికి అంత భారీ మొత్తంలో భూమిని తీసుకోవటాన్ని వ్యతిరేకించారు . ఇప్పుడు విస్తరణ పేరుతో తోలి విడత కంటే ఎక్కువ మొత్తం లో భూమి సమీకరించాలని ప్రదిపాదించినా పవన్ మౌనంగా ఉండటంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన క్యాబినెట్ లో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు టీడీపీ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వీళ్ళను ఎలా ఒప్పించగలుగుతారు అన్నది వేచిచూడాల్సిందే. కొద్ది రోజుల క్రితం ఒక వైపు మంత్రి నారాయణ రాజధాని విస్తరణ కు రైతులు భూములు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు అని ప్రచారం చేస్తుంటే..మరో వైపు జనసేన కు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం రైతుల ఆందోళన తమ దృష్టికి వచ్చింది అని చెప్పిన సంగతి తెలిసిందే.
విస్తరణ కు రైతులు భూములు ఇవ్వటానికి అంత సుముఖంగా లేరు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు క్యాబినెట్ లో ప్రస్తావించటంతో మరింత చర్చ కోసం దీన్ని వాయిదా వేశారు. అయితే ఇది తాత్కాలికమా..లేక రైతులను ఒప్పించేందుకు మరింత మెరుగైన ప్యాకేజీ ప్రకటిస్తామని ఏమైనా చెపుతారా అన్నది తేలాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెద్ద ఎత్తున మంత్రి నారాయణతో ప్రచారం చేయించిన ఒక భారీ ప్రాజెక్ట్ విషయంలో తాత్కాలికంగా అయినా బ్రేకులు వేయటం ఇదే మొదటి సారి అని చెప్పాలి. అదనంగా సమీకరించే భూమితో ఐదు వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు , 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ , మరో 2500 ఎకరాలను గ్రీన్ ఇండస్ట్రీస్ కూడా కేటాయిస్తాం అంటూ చెపుతూ వచ్చిన సంగతి తెలిసిందే. మల్లె ఈ ప్రతిపాదన తిరిగి ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో చూడాలి .



