Telugu Gateway
Andhra Pradesh

అమ్మ‌కానికి అమరావ‌తి భూములు

అమ్మ‌కానికి అమరావ‌తి భూములు
X

ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాజ‌ధాని అమ‌రావ‌తి భూముల‌ను అమ్మ‌కం ద్వారా నిధులు స‌మీక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. పూర్తి స్థాయి రాజ‌ధానిగా అమ‌రావ‌తి వ‌ద్దు కానీ..అమ్మ‌కానికి మాత్రం అమ‌రావ‌తి భూములు కావాలా అన్న చ‌ర్చ మొద‌లైంది. అయితే ఈ భూముల అమ్మ‌కం ద్వారా వ‌చ్చిన ఆ డ‌బ్బును ఆ ప్రాంత అభివృద్ధి చేసేందుకు ఉప‌యోగిస్తారా? లేక ప్ర‌భుత్వం ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగిస్తుందా అన్న అంశంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో సొంతంగా నిధుల సమీకరణకు ప్రభుత్వం భూముల అమ్మ‌కానికి చర్యలు చేప‌ట్టింద‌ని చెబుతున్నారు. అందులో భాగంగానే రాజధాని భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలివిడతలో 248.34 ఎకరాలను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎకరాకు 10 కోట్ల రూపాయ‌ల చొప్పున రూ. 2480 కోట్లు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వేలం ద్వారా భూముల విక్రయానికి ప్రభుత్వం అనుమతిస్తూ 389 జీవో జారీ చేసింది. గతంలో బీఆర్ షెట్టీ మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజికి ఇచ్చిన 148 ఎకరాలను విక్రయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. పురపాలక శాఖపై ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. తదుపరి ఏడాదికి 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. వచ్చే నెలలో భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు. అయితే ఒరిజిన‌ల్ ప్లాన్ ప్ర‌కారం కాకుండా అమ‌రావ‌తిలో ఏమి చేస్తారో స్ప‌ష్ట‌త లేకుండా ఇప్పుడు అక్క‌డ ఎక‌రా ధ‌ర‌కు ప‌ది కోట్ల రూపాయ‌లు పెట్ట ఎవరు కొనుగోలు చేస్తారు అన్న‌ది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story
Share it