అమరావతి ఐఏఎస్ లు ..ఊపిరి పీల్చుకున్నారు!
ఒక్క నిర్ణయం. ఏపీ ఐఏఎస్ అధికారులకు ఒకేసారి దసరా..దీపావళి పండగ వచ్చినంత ఆనందం. వారం రోజుల నుంచి ఈ వ్యవహారం ప్రచారంలో ఉన్నా ఇంత ఆకస్మికంగా నిర్ణయం వస్తుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. అయితే ఢిల్లీకి బదిలీ అయినా సరే కొంత కాలం కీలక పదవిని అట్టే పెట్టుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏపీ సర్కారు సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఈ పోస్టు నుంచి తప్పించి, ఆయన్ను ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న భావనా సక్సేనాను రిలీవ్ చేశారు. ఆమె విదేశీ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ ప్రకాష్ స్థానంలోకి ఎవరు వస్తారనే పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఒక కోణంలో చూస్తే కోన శశిధర్, రాజశేఖర్ ల పేర్లు విన్పిస్తున్నాయి. అయితే సీఎంవోలో చేరేందుకు ఎం టీ క్రిష్ణబాబు కూడా ఆసక్తిచూపుతున్నట్లు ఐఏఎస్ వర్గాల్లో బలంగా ప్రచారంలో ఉంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక బదిలీ వ్యవహారం ఇప్పుడు ఏపీ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోకాళ్లపై కూర్చుని సీఎం జగన్ తో సంభాషించిన తీరు కూడా తీవ్ర వివాదస్పదం అయింది. ప్రవీణ్ ప్రకాష్ తన సహచర అధికారులతో డీల్ చేసే విధానంపై తీవ్ర విమర్శలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆయన చెలాయించిన అపరిమిత అధికారాలతో కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా రోజుల పాటు ఆయనే సీఎం ముఖ్యకార్యదర్శిగా ఉండటంతో అత్యంత కీలకమైన జీఏడీ వ్యవహరాలను కూడా చూశారు. కొద్ది రోజుల క్రితమే జీఏడీ బాధ్యతలను తప్పించి సీఎంవో ముఖ్య కార్యదర్శి పదవికి పరిమితం చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి కూడా తప్పించటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆకస్మిక బదిలీ వెనక పలు అంశాలు ప్రచారంలో ఉన్నాయి.