అమరావతి..ఎన్నికల ఏజెండాగా మారబోతుందా?!
అమరావతి రైతుల పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇది ఓ కీలక అంశంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. అధికారంలోకి రాకముందు అమరావతికి మద్దతుగా ప్రకటన చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ గేర్ వేసిన విషయం తెలిసిందే. అంతే కాదు పలు ఇంటర్వ్యూల్లో కూడా చంద్రబాబు ఇక్కడ ఇళ్లు కట్టుకోలేదు..తానే కట్టుకున్నానని..టీడీపీ తనపై దుష్ప్రచారం చేస్తుందని అప్పట్లో మండిపడ్డారు. ఇక వైసీపీ నేతల మాటలు అయితే ఈ విషయంలో ఓ రేంజ్ కు వెళ్ళాయి. జగన్ నిర్ణయం రివర్స్ కావటంతో నేతలు అందరూ కూడా రివర్స్ బాట పట్టారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా రాజధాని వ్యవహారంపై అనిశ్చితి అలా కొనసాగుతూనే ఉంది.న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మొదలైన ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించగా..హైకోర్టు పలు షరతులతో మంజూరు చేసింది. పరిమిత సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనాలని కోర్టు ఆదేశించింది. అయితే పాదయాత్రలో పాల్గొనే వారి సంఖ్య అలాగే ఉన్నా వీరికి సంఘీభావం తెలుపుతూ వచ్చే వారి సంఖ్య భారీ స్థాయిలో ఉండటంతో రాజకీయ రగడ సాగుతోంది. ఏ జిల్లాకు వెళ్లిన సమయంలో ఆ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, రైతు నాయకులు, ఇతర సానుభూతి పరులు వచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారు. అంతే కాదు..రైతుల పాదయాత్రకు పెద్ద ఎత్తున విరాళాలు కూడా అందజేస్తున్నారు.
బుధవారం నాడు ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. అదే సమయంలో పాదయాత్రకు రైతుల మద్దతు కూడా పెరుగుతోంది. టీడీపీ ఒకే రాజధాని ఉండాలి.అది అమరావతే కావాలి అనే నినాదంతోనే ముందుకు సాగుతుండగా..అధికార వైసీపీ మాత్రం మూడు రాజధానుల విధానం తీసుకుంది. అయితే మూడు రాజధానుల వ్యవహారం కూడా కోర్టు పరిధిలో ఉండటంతో ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. ఈ తరుణంలో పాదయాత్రకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. రైతుల పాదయాత్ర సంఘీభావం తెలిపేందుకు వచ్చే వారి సంఖ్య భారీ స్థాయిలో ఉండటంతో పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం కోర్టు చెప్పిన పరిమితులను చూపెడుతున్నారు. అయితే అమరావతి జెఏసీ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. పాదయాత్ర చేస్తున్న వారి సంఖ్య పరిమిత స్థాయిలోనే ఉందని..అయితే తమకు మద్దతుగా వస్తున్న వారు ఎక్కడికి అక్కడ సంఘీభావం తెలిపి వెళుతున్నారని చెబుతున్నారు. ఇదే అంశంపై అమరావతి పాదయాత్ర చేసే రైతులు..పోలీసుల మధ్య గురువారం నాడు ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పల పాడు మండలం చదలవాద వద్ద రైతలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో ఒక రైతు చేయి విరిగినట్లు సమాచారం. లాఠీఛార్జి సమయంలో పోలీసులు..రైతుల మధ్య తోపులాట జరిగింది. హైకోర్టు అనుమతించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవటం ఏమిటని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు.