Telugu Gateway
Andhra Pradesh

అమరరాజా ఇక ఆంధ్రా లో పెట్టుబడులు పెట్టదా?!

అమరరాజా ఇక ఆంధ్రా లో పెట్టుబడులు పెట్టదా?!
X

పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. కంపెనీ నిర్ణయాలను చూస్తున్న వారు మాత్రం ఇప్పట్లో అది జరిగే పని కాదు అని చెపుతున్నారు. ఎందుకు అంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కంపెనీ పై వేధింపులు ఎక్కువ అయ్యాయి. నిజంగా అమరరాజా కంపెనీ ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరి దిద్దుకోమని ఆదేశాలు ఇవ్వొచ్చు అది ప్రభుత్వం బాధ్యత కూడా. కానీ ఆలా కాకుండా టార్గెట్ చేసినట్లు వ్యవహరించటం తో కంపెనీ కూడా తన రూట్ మార్చు కుంది అని చెపుతున్నారు. . ఇప్పుడు కొత్తగా తెలంగాణ లో 9500 కోట్ల రూపాయాల పెట్టుబడి నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రాజెక్టులను కూడా తమిళనాడుకు తరలిస్తున్నారు తప్ప ఆంద్ర ప్రదేశ్ లో మాత్రం కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరరాజా బ్యాటరీస్ కంపెనీ దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటి. అలాంటి సంస్థ ఇప్పటికే ఉన్న యూనిట్స్ దగ్గర కాకుండా..సొంత రాష్ట్రము వదిలేసి తెలంగాణాలో ఇంత బారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించటం పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రము గురించి ఖచ్ఛితంగా దేశ కార్పొరేట్ రంగానికి తప్పుడు సంకేతాలు పంపుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అమరరాజా బ్యాటరీస్ సంస్థ శుక్రవారం నాడు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ తెలంగాణాలో ఏకంగా 9500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో అత్యాధునిక లిథియం బ్యాటరీల తయారీ యూనిట్ ను ఇక్కడ ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో కొత్తగా 4500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి రానుంది. నిజంగా ఇంత పెద్ద పెట్టుబడి అవకాశాన్ని వదులుకోవడం అన్నది ఏపీకి నష్టమే అన్న చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే ఆంద్ర ప్రదేశ్ లోని అనంత పురం నుంచి జాకీ సంస్థ కూడా యూనిట్ ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా కీలక సంస్థలు ఆంద్ర ప్రదేశ్ ను వదిలి...తెలంగాణ వైపు పరుగులు పెడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ రంగానికి ఇస్తున్న ప్రోత్సహం బాగుందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.


Next Story
Share it