అంతా స్కెచ్ ప్రకారమే!

ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ భారీ గోల్ మాల్స్ కు..కుంభకోణాలకు కేంద్రంగా మారింది. ఈ శాఖపై ఎన్ని ఆరోపణలు వచ్చినా..విమర్శలు వచ్చినా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం అంతా చూసీ చూడనట్లే వదిలేస్తున్నారు. దీనికి కారణం అంతా పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే జరుగుతుండటమే అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో విద్యుత్ శాఖ లో గత కొన్ని సంవత్సరాలుగా చక్రం తిప్పుతున్న అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఏపీ జెన్ కో అనంతపురం జిల్లా యాడికి మండలం కమలంపాడులో తలపెట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ ను ఏఎంఆర్ సంస్థకు కేటాయించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ ప్రాజెక్ట్ అంచనాలనే ఏకంగా 20 శాతం మేర పెంచారు అనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జరిగిన జెన్ కో బోర్డు మీటింగ్ లో ఈ టెండరును దగ్గర దగ్గర 9 శాతం ఎక్సెస్ కు ఓకే చేసినట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.
గతంలో ఇదే తరహా ప్రాజెక్ట్ ఒక మెగా సంస్థకు కట్టబెట్టినప్పుడు కూడా తొమ్మిది శాతం ఎక్సెస్ కు ఇవ్వటంతో ఇప్పుడు అనంతపురం ప్రాజెక్ట్ ను కూడా అదే తరహాలో తొమ్మిది శాతం ఎక్సెస్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు అని...అయితే ఈ సారి జెన్ కో బోర్డు నేరుగా నిర్ణయం తీసుకోకుండా ఫైల్ ను ప్రభుత్వానికి పంపించి అక్కడ నుంచి ఒక చేయించే స్కెచ్ వేసినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ టెండర్ దగ్గర నుంచే ఎన్నో స్కెచ్ లు వేశారు. అందుకే కొన్ని నెలల క్రితమే ఖరారు కావాల్సిన టెండర్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. విద్యుత్ శాఖలో ఈ ప్రాజెక్ట్ తమ వాటా కింద ఇవ్వాలని పట్టుబట్టిన ఒక కీలక మంత్రి కోసం అయన టీం రంగంలోకి దిగి పని చేసింది. ఈ వ్యవహారంలో ఆ కీలక మంత్రి తరపున ఒక ఎంపీ కూడా జోక్యం చేసుకుని అంతా సెట్ చేసినట్లు చెపుతున్నారు. అనంతపురం జిల్లాలోని కమలంపాడు పీఎస్ పీ ప్రాజెక్ట్ ఎఎంఆర్ కు వెళుతుంది అనే విషయాన్ని తెలుగు గేట్ వే. కామ్ జూన్ 17 నే వెల్లడించింది. ఇప్పుడు అలాగే ఈ ప్రాజెక్ట్ ఆ సంస్థకు దక్కింది అని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ గడువును ఏకంగా ఆరేడు సార్లు పొడిగించినట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ జెన్ కో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ను ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా పనులు అప్పగించి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూడాలి కానీ కొంత మంది ఉన్నతాధికారులు తమకు నచ్చిన వాళ్లకు కాంట్రాక్టు దక్కేలా చూడటం కోసం తమ వంతు సహకారం అందించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖ లో కీలక స్థానాల్లో ఉన్న కొంత మంది అధికారులు రాష్ట్రం కోసం కాకుండా కొన్ని కంపెనీలు..కొంత మంది కాంట్రాక్టర్ల కోసం పని చేస్తున్నట్లు ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురి అయిన ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ హైదరాబాద్ లో రెస్ట్ లో ఉంటూ కూడా ఈ ప్రాజెక్ట్ క్లియర్ చేశారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జెన్ కో చైర్మన్ కూడా ఆయనే. ఈ ప్రాజెక్ట్ కియరెన్సు లో విజయానంద్ కూడా ఎంతో స్పెషల్ ఇంటరెస్ట్ చూపించినట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అంతా ఒక స్కెచ్ ప్రకారమే ఈ ప్రాజెక్ట్ ఎఎంఆర్ కు వెళ్ళింది అని...తెర వెనక వ్యవహారాలు జరగాల్సినవి జరిగిపోతాయి అని విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి.



