Telugu Gateway
Andhra Pradesh

పవన్ మొగ్గు ఎవరివైపో !

పవన్ మొగ్గు ఎవరివైపో !
X

జనసేన రాజ్యసభ రేస్ లోకి మరో పారిశ్రామికవేత్త వచ్చారా?. ఆయన కోసం జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నిహితులు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది ఆ పార్టీ వర్గాల నుంచి. జూన్ లో ఖాళీకానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో దృష్టి సారించనుంది. మే నాలుగున ఈ ఫలితాలు వెల్లడికానున్న విషయం తెలిసిందే. ఏపీ నుంచి ఖాళీ కానున్న నాలుగు సీట్లు కూడా కూటమికే దక్కనున్నాయి. ఇందులో ఒకటి జనసేన కు కేటాయించటం పక్కా అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలోనే జనసేన కు ఇవ్వాల్సిన సీటును ఇవ్వకుండా నాగబాబు కు ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవి ఇస్తామని ఏకంగా తెలుగు దేశం పార్టీ లెటర్ హెడ్ మీద ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ తన రాజకీయ అవసరాల కోసం..నారా లోకేష్ సన్నిహితుడు సానా సతీష్ కు రాజ్య సభ సీట్ ఇవ్వటం కోసం ఇలా చేశారు అని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పుడు మరో సారి జనసేన సీటు వాయిదే వేసే అవకాశం ఉండదు. మళ్ళీ అంటే 2028 జూన్ లో ఖాళీ అయ్యే నాలుగు సీట్లకు కూడా ఇప్పటి నుంచి ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఎన్నికల ఏడాది ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు జనసేన కు మరో సీటు కేటాయించే అవకాశాలు తక్కువగానే ఉంటాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.అయితే ఇప్పుడు జనసేన కు దక్కే ఒక్క సీటు వివాదాస్పద పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు కేటాయించే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంత బలంగా ఉందో...పార్టీకి వచ్చే ఫస్ట్ సీటు లింగమనేని కి ఇస్తే మాత్రం జనసేనలో రచ్చ ఖాయం అనే ప్రచారం పార్టీ వర్గాల్లోనే ఉంది. ఎక్కువ మంది లింగమనేని పేరును వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా అంతిమ నిర్ణయం తీసుకునేది పవన్ కల్యాణే అన్న విషయం తెలిసిందే.

జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మరో పారిశ్రామికవేత్త కూడా జనసేన రాజ్య సభ రేస్ లోకి వచ్చినట్లు చెపుతున్నారు. ఆయనే సిద్దార్థ్ ఇన్ఫ్రా టెక్ ఎండీ బండారు నరసింహ రావు. ఆయన కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతున్నారు. నరసింహ రావు గతంలో జనసేన తరపున లోక్ సభ బరిలో దిగేందుకు కూడా ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కానీ పొత్తులో భాగంగా సీటు దక్కలేదు. దీంతో ఇప్పుడు ఆయన రాజ్య సభ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళతో పాటు టాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రముఖ నిర్మాత కూడా ఒకరు రాజ్యసభ రేసులో ఉన్నట్లు జనసేన వర్గాలు చెపుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో తమ వెనక బలంగా నిలబడిన వాళ్లకు కాకుండా ఇతరులకు జనసేనకు వచ్చే ఒక్క సీటు ఇస్తే పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కోకతప్పదు అని చెపుతున్నారు. వివిధ రకాల కారణాలతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ విషయంలో సొంత మనుషులే తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ విషయంలో కూడా తన నిర్ణయం ఎక్కువ మంది అభీష్ఠానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం అది జనసేనలో చిచ్చు రాజేయటం ఖాయం అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట.

Next Story
Share it