జగన్ కేబినెట్ లో మిగిలేది ఎవరు?
ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. సీఎం జగన్ మొత్తానికి మొత్తం మంత్రివర్గాన్ని మారుస్తారా? లేక కొంత మందికి ఏమైనా మినహాయింపులు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. చాలా మందికి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్న ఆసక్తి కొందరిలో నెలకొంది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ కొత్త ఆర్ధిక మంత్రిగా ఎవరిని తీసుకోబోతున్నారు అన్నది అత్యంత కీలకమైన అంశంగా మారింది. అయితే ఆర్ధిక మంత్రిగా ఎవరు ఉన్నా.. ఎవరికి..ఎప్పుడు నిధులు కేటాయింపులు చేయాలి అన్నది సీఎంవో మార్గదర్శనంలో సాగుతున్నది అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే గత మూడు సంవత్సరాలుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్ధిక శాఖలో కొనసాగారు. నిత్యం అప్పులు తీసుకురావటంతోపాటు ఈ వ్యవహారాలు చూసుకోవటంలో ఆయనకు కొంత అనుభవం వచ్చింది. ఈ కారణంతోనే మినహాయింపు పొందే వారిలో ఆయన కూడా ఉంటారని కొంత కాలం ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అది కూడా లేదని చెబుతున్నారు. దీంతోపాటు పలు కోణాల్లో విశ్లేషించిన తర్వాత సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం ఉందని భావించారు.
అయితే ఇప్పుడు ఆ లెక్కలు కూడా మారాయని సమాచారం. గురువారం నాడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇదే ఇప్పటి మంత్రులకు చివరి సమావేశం కానుంది. ఇందులో మంత్రులతో సీఎం జగన్ రాజీనామాలు తీసుకోనున్నారని చెబుతున్నారు. అదే సమయంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు సంబందించి జగన్ బుధవారం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం అయి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ఆయన సమయం తీసుకోనున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరు వస్తారనేది సీఎం జగన్ కు తప్ప ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ప్రచారంలో ఉన్న పేర్లు అన్నీ కూడా ఊహగానాలే అంటున్నాయి వైసీపీ వర్గాలు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్ కూర్పు ఉంటుందని జగన్ విస్పష్టంగా చెప్పారు. అదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల లెక్కన కూడా ఈ సారి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.