Telugu Gateway
Andhra Pradesh

అందరిది అదే ఫార్ములానా?!

అందరిది అదే ఫార్ములానా?!
X

సినిమాల్లో ఒక ఫార్ములా హిట్ అయితే...కొన్ని సంవత్సరాల పాటు దర్శక, నిర్మాతలు...హీరోలు కూడా అదే ఫార్ములా వైపు పరుగులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో కొన్ని హిట్ అయితే...మరికొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టేవి. కొత్త కథల గురించి..కొత్త పద్దతుల గురించి ఆలోచించటం కంటే అప్పటికే సక్సెస్ అయిన మోడల్ ను ఫాలో కావటం ఈజీ అనే కాన్సెప్ట్ తోనే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇది సినిమాల మోడల్ అయితే...రాజకీయాల్లోకి ప్రవేశించాలి అనుకునే హీరోలు ఇక్కడ కూడా అదే మోడల్ ఫాలో కావాలనే యోచనలో ఉన్నారా? అంటే చర్చలు ఆ దిశగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాల్లో సక్సెస్ అయిన హీరోలు రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా మీడియా లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీళ్ళు అంతా కూడా తమిళనాడు లో మొన్నటి ఎన్నికల్లో సంచలన విజయం దక్కించుకున్న టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మోడల్ ఫాలో అయ్యేందుకు ఆసక్తిచూపుతున్నట్లు...ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో టాప్ హీరో లుగా ఉన్నఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. పొలిటికల్ ఎంట్రీ అంశంపై , మీడియాలో వచ్చిన వార్తలపై అటు ఎన్టీఆర్ కానీ...ఇటు అల్లు అర్జున్ ఎక్కడా అధికారికంగా స్పందించకపోయినా వాళ్ళ టీంలు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నాయి. పొలిటికల్ ఎంట్రీ కోసం అల్లు అర్జున్ దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయ్యారు అని... కొత్త పార్టీ పై చర్చలు జరిపారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని...అల్లు అర్జున్ పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు తప్ప మరొకటి లేదు అని ఆయన టీం ఖండన విడుదల చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు అని ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక లేఖ విడుదల చేసింది. జులై 18 న తిరుపతిలో నిర్వహించనున్న ఊరు..వాడా కార్యక్రమానికి..రాజకీయాలకు ఏ మాత్రం సంబంధము లేదు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

సోషల్ మీడియా లో జరిగే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు...గందరగోళానికి గురికావద్దు అని పిలుపునిచ్చారు. అయితే తెలుగు దేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నంత కాలం ఎన్టీఆర్ రాజకీయాల వైపు చూడరు అని...ఆ తర్వాతే ఆయన తన పొలిటికల్ మూవ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని తెలిపారు. కొంత మంది మంత్రులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఎన్టీఆర్ కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నా కూడా అదను కోసం వేచిచూసి...ఆ తర్వాత మాత్రమే అడుగులు వేసే అవకాశం ఉంది అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. మరో వైపు సంధ్య థియేటర్ ఘటన విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసినప్పుడు అల్లు అర్జున్ స్పందించిన తీరు అటు టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ కు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంది అనే విషయం టాలీవుడ్ వర్గాల్లో బలంగా ఉంది. అయితే ఆయన కూడా సమయం కోసం ఎదురుచూస్తున్నారు అని..ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రయోగాలు ఉండే అవకాశం లేదు అని...కాకపోతే ఎవరి స్టైల్ లో వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు.

Next Story
Share it