జగన్ వన్ ఇయర్ ఇంట్లో

సహజంగా పార్టీకి ఏ అంశంలో అయినా ఒక విధానం ఉండాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ మాత్రం సభ సభకో విధానం అన్నట్లు వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి శాసనమండలి సమావేశాలకు హాజరు అయి...ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి తమకు సమయం ఇవ్వరు అని చెప్పి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటామని ప్రకటించి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలనే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా అవాక్కు అయ్యేలా చేశారు. అసెంబ్లీ కి హాజరు విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన్ని సమర్ధించే వాళ్ళు కూడా గట్టిగా వ్యతిరేకించారు. అసెంబ్లీ హాజరు విషయంలో జగన్ పైకి చెప్పేది ఒక సాకు మాత్రమే అని...కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సభలో కూర్చోవటానికి ఆయనకు ఇగో అడ్డం వస్తోంది అనేది ఎక్కువ మంది చెపుతున్న మాట. మొన్నటి ఎన్నికల్లో జగన్ ఏకంగా 164 చోట్ల ఓడిపోయారు.
అదెలా అంటే కేవలం తనను చూసి...గత ఐదేళ్లలో తన పనితీరు చూసి ...డీబీటీ ద్వారా తాను పంచిన రెండున్నర లక్షల కోట్ల రూపాయలు చూసే రాష్ట్ర ప్రజలు వైసీపీ కి ఓటు వేస్తారు తప్ప..అప్పటి వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి కాదు అని ఆయన అధికారికంగానే చెప్పారు. అందుకే అది వైసీపీ అభ్యర్థుల ఓటమి కంటే 164 నియోజకవర్గాల్లో జగన్ ఓటమి కిందే లెక్క. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా కూడా జగన్ మోహన్ రెడ్డి లో ఎలాంటి మార్పు వచ్చిన దాఖలాలు లేవు అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి దారుణ ఫలితం వచ్చిన తర్వాత అసలు దీని వెనక ఉన్న కారణాలు ఏంటి...ఇంతటి ఘోర పరాజయానికి ఏమేమి అంశాలు ప్రభావితం చేశాయో సమీక్షించుకోవాల్సిన జగన్ మోహన్ రెడ్డి సింపుల్ గా చంద్రబాబు తో పాటు కూటమి సర్కారు ఇచ్చిన సూపర్ సిక్స్ కారణంగానే తాము ఓటమి పాలు అయ్యాం అని ఒక సూత్రీకరణ ఖరారు చేసుకుని దాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.
ఇక్కడ జగన్ ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్నో సార్లు చంద్రబాబు పాలన చూశారు...ఆయన హామీల అమలు చరిత్ర కూడా రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. మొన్నటి ఎన్నికల్లో జగన్ మళ్ళీ వద్దు అని కసితో వేసిన ఓట్లే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం విస్మరించారు. సొంత పార్టీ నాయకుల మాట కూడా వినని వ్యక్తి కేవలం తనకు తోచిన విధంగా రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో జగన్ మోహన్ రెడ్డి ఒక ఉదాహరణగా నిలుస్తారు వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం చాలా మంది వైసీపీ సీనియర్ నేతలు లిక్కర్ అంశం తమను దారుణంగా దెబ్బతీసింది అని...రోడ్లను విస్మరించటంతో పాటు పాలన అంతా జగన్ సెంట్రిక్ గా సాగటం వల్ల అన్నీ ఆయనే చూసుకుంటారు అని చాలా చోట్ల నేతలు కూడా వదిలేశారు అని చెపుతున్నారు. ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసి ఏడాది పూర్తి అయిన తర్వాత కూడా జగన్ లో ఎలాంటి మార్పు లేదు అని...ఆయన ఎక్కడ మీటింగ్ కు వెళ్లినా ఈ మధ్య జనాలు భారీ గా వస్తుండంతో మళ్ళీ గెలుపు తమదే అన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు అని ఒక సీనియర్ నేత వెల్లడించారు.
అధికారంలో ఉన్నప్పుడు కనీసం సచివాలయానికి కూడా వెళ్లకుండా ఎలా ఇంట్లో ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు కూడా పార్టీ నేతలను జగన్ అంతా ఈజీ గా కలవరు అని..తాను కలవాలి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళను తన దగ్గరకు పిలుపించుకుంటారు అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం చంద్రబాబు సర్కారు అంటే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తే ప్రజలు జగన్ కు..వైసీపీ కి ఓట్లు వేయాలి తప్ప మరో కారణం కనిపించటం లేదు అనే అభిప్రాయం లో వైసీపీ నేతల్లో కూడా ఉంది. ఏడాది ఆలస్యంగా అయినా కూడా చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తే జగన్ కు సాలిడ్ ఓటు బ్యాంకు గా ఉన్న వాళ్లలో కూడా మార్పు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయంతో కొంత మంది నేతలు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్..వైసీపీ భవిష్యత్.. వైసీపీ గెలుపు కూడా చంద్రబాబు, కూటమి సర్కారు చేతుల్లో ఉన్నట్లే లెక్క అని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఒక సారి జగన్ పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి ఇప్పుడు జగన్ ఏది పడితే అది చెపితే ప్రజలు అంత ఈజీగా నమ్మే పరిస్థితి ఉండదు అనే చెప్పొచ్చు.