ఆ కంపెనీ ఏది అడిగితే దానికి ఓకే !

డేటా సెంటర్ ల్యాండ్స్ సేల్ డీడ్ కు గ్రీన్ సిగ్నల్...అదనపు వెసులుబాట్లు కూడా
గౌతమ్ అదానీ ఆసియాలోనే నంబర్ వన్ సంపన్నుడిగా అవతరించారు. ఆయన మరో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి మరీ ఈ ప్లేస్ సంపాదించుకున్నారు. శుక్రవారం నాడే ఈ వార్త బయటకు వచ్చింది. గౌతమ్ అదానీ సంపద 92 .6 బిలియన్ డాలర్లు అయితే...ముఖేష్ అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లు. ఇంతటి సంపన్నుడికి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన...అప్పు చేస్తే తప్ప నెలగడవని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన కోరుకున్న వరాలు అన్నీ ఇచ్చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అదానీ గ్రూప్ కు సరెండర్ అయినట్లు కనిపిస్తోంది చర్చ సాగుతోంది. ఆ కంపెనీ ఏది అడిగితే దానికి ఓకే చెపుతోంది చంరబాబు సర్కారు. ముందు కేటాయించిన భూములు చాలవు..ఇంకా ఇవ్వండి అంటే సరే అని..కంపెనీ అడిగిన అన్ని భూములు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ భూములను సేల్ అగ్రిమెంట్ కాకుండా...సేల్ డీడ్ ఇవ్వాలని కోరింది. ఇప్పుడు దానికి కూడా ఓకే చెప్పింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
గూగుల్ డేటా సెంటర్ పేరుతో ఈ మొత్తం వ్యవహారం సాగుతోంది. కంపెనీ ఏమి చెపితే అవే కండిషన్లను ప్రభుత్వం అమలు చేయటానికి సిద్ద పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం నాడు ఐటి శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ జారీ చేసిన జీవో చూస్తే ఎవరికైనా ఇవే అనుమానాలు రాక మానవు. వైజాగ్ లో డేటా సెంటర్ పెట్టేది గూగుల్ అని చెపుతారు కానీ భూములు అన్నీ కూడా అదానీ గ్రూప్ కంపెనీల మీద కేటాయించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మూడు చోట్ల ఈ డేటా సెంటర్ల కోసం 480 ఎకరాలు కేటాయించింది. నాలుగు నెలల తర్వాత ఈ మొత్తాన్ని 601 ఎకరాలకు పెంచారు. అంటే మొదట చేసిన కేటాయింపులకు తర్వాత చేసిన కేటాయింపులకు మధ్య తేడా 121 ఎకరాలు ఉంది. గూగుల్..అదానీ వంటి కంపెనీలు ఏ మాత్రం అంచనాలు లేకుండా డీపీఆర్ లు ఇచ్చి 480 ఎకరాలకు ముందు ఎందుకు ఒప్పుకున్నాయి...మళ్ళీ ఇప్పుడు ఆ మొత్తం ఎందుకు 601 ఎకరాలకు చేరింది అన్నది ఎవరికీ అంతు చిక్కని వ్యవహారం. భూముల వ్యవహారం అయిపోయింది ఇప్పుడు అదానీ ఏది అడిగితే వాటికీ ఓకే చెపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పరిశ్రమలకు ప్రభుత్వ భూములు కేటాయించేటప్పుడు సాధారణంగా కంపెనీలకు ఏపీఐఐసీ మొదట సేల్ అగ్రిమెంట్ చేస్తుంది. ఒప్పందం ప్రకారం పెట్టుబడులు..ఉద్యోగాలు తదితర నిబంధనలు అమలు చేసిన తర్వాత సేల్ డీడ్ చేస్తామని షరతు విధిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ తమకు ఈ డేటా సెంటర్ భూముల విషయంలో సేల్ డీడ్ కావాలని కోరింది. దీనికి కూడా ఓకే చెపుతూ ఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో పాటు కంపెనీకి కొత్తగా పలు సడలింపులు ఇచ్చారు. జీవోలో పేర్కొన్న అంశాల ప్రకారం స్టాండర్డ్ పార్కింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వటమే కాకుండా...ఫ్లోర్ నుంచి సీలింగ్ ఎత్తుపై ఎలాంటి పరిమితి లేదు అన్నారు.
ఈ ప్రాజెక్ట్ కింద కేటాయించిన భూముల్లో ఏ జోన్‌లోనైనా డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోవటానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్తి పన్నును నివాస రేట్లతో సమానంగా విధించాలని వచ్చిన అభ్యర్థనపై మున్సిపల్ శాఖ సంబంధిత అధికారికి ఫైల్ పంపి నిర్ణయం తీసుకోవాలి అని పేర్కొన్నారు. అంటే వ్యాపార సంస్థలకు కూడా నివాస సముదాయాల తరహాలో ఆస్థి పన్ను విదించటానికి ప్రభుత్వం అంగీకరించినట్లు అయింది. జైలు సరిహద్దుల నుంచి ఎలాంటి బఫర్ జోన్ పరిమితులు లేకుండానే డేటా సెంటర్లకు అనుమతి ఇచ్చినట్లు జీవోలో పేర్కొన్నారు. వీటితో పాటు పలు వెసులుబాట్లు అదానీ సంస్థకు కల్పించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. అతి తక్కువ ఉద్యోగాలు కల్పించే ఈ డేట్ సెంటర్ కు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వటంపైనే విమర్శలు ఉంటే..ఇప్పుడు ఇంకా కంపెనీ ఏది కోరితే దానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓకే చేయటం చూసి కొంత మంది అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు.



